ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభాగంలో మరోసారి అవినీతి ఆరోపణలు తలెత్తాయి. మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగ మాజీ డీజీ ఏ.బి. వెంకటేశ్వరరావు, సెంటర్ ఫర్ లిబర్టీ (CFL) అనే పౌరసంస్థతో కలిసి రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. వారి ఆరోపణల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 25 KVA ట్రాన్స్‌ఫార్మర్‌ను ఒక్కదాన్ని సుమారు ₹1.19 లక్షలకు కొనుగోలు చేశారు. అయితే అదే మోడల్ ఇతర రాష్ట్రాల్లో — ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కేవలం ₹73,000 కే లభిస్తోందని పేర్కొన్నారు. ధరల్లో ఉన్న వ్యత్యాసం ఇందులో జరిగిన అవినీతి స్థాయిని స్పష్టంగా తెలియచేస్తుంది వారు ఆరోపించారు.
Also Read : కోనసీమ తిరుమల ఆదాయం తెలుసా..?
సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధుల ఆరోపణల ప్రకారం, టెండర్‌లో EEL-V గ్రేడ్ ట్రాన్స్‌ఫార్మర్‌లు సరఫరా చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ, అందుకు తక్కువ నాణ్యత గల EEL-III గ్రేడ్ పరికరాలు సరఫరా చేసినట్లు వెల్లడైంది. ఇంకా విచిత్రంగా, పరికరాల పరిశీలన కూడా వాటి డెలివరీ జరిగిన రోజునే జరిగినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని, అవినీతి ఉద్దేశపూర్వకమని వారు ఆరోపించారు. వారు చెప్పిన దాని ప్రకారం, ఈ అవినీతి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో మొదలై, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతోందట. ఒకే కంపెనీలు, ఒకే కాంట్రాక్టర్లు వరుసగా లాభాలు పొందుతున్నారని కేఫ్ల ప్రతినిధులు ఆరోపించారు.
ఏబీ వెంకటేశ్వరరావు గతంలో భద్రతా పరికరాల టెండర్లలో అవకతవకల ఆరోపణలతో విచారణను ఎదుర్కొన్నారు. కానీ ఆ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడంతో, ప్రభుత్వం కూడా ఆ దర్యాప్తును నిలిపివేసింది. ఇప్పుడు ఆయన స్వయంగా విద్యుత్ రంగంలో అవినీతి పై బహిరంగంగా మాట్లాడడం విశేషం. ఏబి వెంకటేశ్వరరావు గారితో పాటు CFL సంస్థ కలిసి ఈ వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా నిధుల దుర్వినియోగమే కాకుండా, తక్కువ నాణ్యత పరికరాల వల్ల విద్యుత్ సరఫరా నాణ్యత దెబ్బతింటుందని హెచ్చరించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు
ఈ ఆరోపణలు నిజమైతే, ఇది ప్రజా ధన దుర్వినియోగానికి మరో ఘనమైన ఉదాహరణగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు. విద్యుత్ రంగం వంటి ప్రజా ప్రయోజనాల రంగంలో పారదర్శకత తప్పనిసరి అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.




