గత పదేళ్ళ నుంచి పోలవరం ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున చర్చల్లో నిలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళల్లో పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎవరెన్ని డ్రామాలు ఆడినా సరే పోలవరం నిర్మాణం పై ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయలేదు అనే చెప్పాలి. ఇక 2019 తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ను అప్పటి సిఎం వైఎస్ జగన్ పూర్తి చేసే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు అన్న విషయం నిపుణులు పేర్కొనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్మాణం పూర్తిచేయకపోవటం సంగతి పక్కన పెడితే, అసలు పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోడానికి లేక వీలైనంత ఆలస్యం చేయడానికి ప్రయత్నించినట్లు గత జగన్ సర్కార్ లో తీసుకున్న నిర్ణయాలను చూస్తే అర్ధం అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణకు ఈ విషయంలో జగన్ సహకరించి ఎత్తు తగ్గించే కార్యక్రమం చేసి విమర్శలు రావడంతో నిర్మాణం ఆలస్యం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు పెద్ద ఎత్తున పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ సిద్దమైంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఇటీవల ఢిల్లీ పర్యటన కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కేంద్ర జలశక్తి మంత్రి మరియు ఆర్ధిక మంత్రిని కలిసి బడ్జెట్ కేటాయింపుల పై విజ్ఞప్తి చేసి, పోలవరం పూర్తయితే కేంద్రానికి ఎలాంటి లబ్ది కలుగుతుందో వివరించి వచ్చారు. ఇక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా దీనికి సంబంధించి నిధులు కేటాయింపు జరిగింది. అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.
చట్టం ప్రకారం, పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు, కేంద్రానిదే బాధ్యత. ఎంత ఖర్చు అయినా, దాన్ని కేంద్రమే భరిస్తుంది అని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకునే విధంగా 2014 లో ఒప్పందం జరిగిందని, తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, అక్కడ ఉన్న గ్రామాలకు పునరావాసం కల్పించే విధంగా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. పోలవరం పూర్తయ్యే వరకు ప్రతి పైసా కేంద్రమే భరిస్తుంది అన్నారు ఆమె. దీంతో కేంద్రం ప్రకటించిన 15 వేల కోట్లు కేవలం అప్పు అని ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు షాక్ తగిలినట్లు అయింది.