ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడు తర్వాత కొన్ని పరిణామాలు భయపెడుతున్నాయి. ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళగా అక్కడ ఒక నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశాడు. స్థానిక పోలీసులతో అతను ఫోటోలు కూడా దిగటం వివాదాస్పదమైంది.
Also Read : కొల్లేరు ప్రక్షాళన సాధ్యమేనా..?
ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కూడా జరిపారు. అయితే ఈ విచారణలో ఏ విషయాలు బయటకు వచ్చాయి.. ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు. కానీ దీనిపై డిజిపి మాత్రం సీరియస్ గానే ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అటు హోం మంత్రి అనిత కూడా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత పవన్ విజయవాడలో బుక్ ఫెస్టివల్ కు వెళ్ళినప్పుడు కరెంటు పోవడం సంచలనం అయింది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం పై డ్రోన్ ఎగరడాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు.
Also Read : రాజకీయాల్లోకి పీవీ సునీల్.. బిజెపి ప్రోత్సాహంతో కూటమి ప్రయాణం
జనసేన ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఐదు ప్రత్యేక బృందాలుగా ఈ విచారణ కొనసాగుతోంది. సెక్యూరిటీ పరమైన అనుమానాలను జనసేన పార్టీ వ్యక్తం చేస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగరడంతో జనసేన నేతలు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. రేషన్ బియ్యం మాఫియా పెద్ద ఎత్తున ఉండటంతో పవన్ కళ్యాణ్ ను వాళ్ళు ఏమైనా టార్గెట్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.