అందరు వైసీపీకి గుడ్ బై చెబుతుంటే… కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్‌తో కలిసి పని చేసేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న సదరు నేత గతంలో ఏపీ పీసీసీ అధ్యక్షునిగా కూడా ఏడాది పాటు పని చేశారు. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల నాయకత్వంపై ఆయనకు నమ్మకం సన్నిగిల్లినట్లు తెలుస్తోంది. షర్మిల చేస్తున్న పోరాటాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని ఇటీవల తన సన్నిహితుల వద్ద వాపోయారు కూడా. దీంతో ఈ మాజీ మంత్రి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : గనుల వెంకటరెడ్డిని వెంటాడుతున్నారా..? మళ్ళీ దొరికాడు..!
వాస్తవానికి 2014 ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులతో పాటే ఆయన కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అటు చంద్రబాబు కూడా ఆయన సినీయారిటీని, క్యాడర్‌ను, కులంలో ఉన్న బలాన్ని బేరీజు వేసుకుని టికెట్ ఇచ్చారు కూడా. అయితే అప్పటికే టీడీపీలో చేరిన మరో కాంగ్రెస్ నేత తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి సైలెంట్‌గా ఉన్న ఈ మాజీ మంత్రికి.. పార్టీ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ఏకంగా పీసీసీ పగ్గాలు అప్పగించారు. వరుసగా రెండు సార్లు ఓడినప్పటికీ… పీసీసీ నేతగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారని అంతా భావించారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం అండ కూడా ఉంటుందని భావించారు. కానీ ఏడాది పాటు ఆ స్థానంలో ఉన్నప్పటికీ… కాంగ్రెస్‌కు ఎలాంటి మేలు జరగలేదు. దీంతో ఆయనను తప్పించారు కాంగ్రెస్ పెద్దలు.
Also Read : పాపం అవంతి.. భవిష్యత్తు ఏమిటో?
పదవి పోవడంతో నాటి నుంచే మరోసారి టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేశారు ఈ మాజీ పీసీసీ నేత. అయితే అప్పటికే నియోజకవర్గంలో ఓ సారి పోటీ చేసిన మహిళా నేత… పార్టీ క్యాడర్ చెయ్యి దాటిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ విషయం గుర్తించిన చంద్రబాబు… తిరిగి ఆ యువ మహిళా నేతకే మరోసారి టికెట్ ఇచ్చారు. దీంతో తనకు ఇక ఛాన్స్ రాదని మాజీ పీసీసీ చీఫ్ ఫిక్స్ అయ్యారు. ఐదు నెలలు సైలెంట్‌గా రాష్ట్ర రాజకీయాలు గమనిస్తున్న సదరు మాజీ మంత్రి… టీడీపీలో చేరేందుకు అవకాశం లేదని గుర్తించారు. అదే సమయంలో షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం కష్టమని కూడా భావించారు. ఇక వైసీపీ నుంచి కీలక నేతలంతా వెళ్లిపోవడంతో.. ఈ సమయంలో ఆ పార్టీలో చేరితే… తనకు రాజకీయంగా లాభం కూడా జరుగుతుందని భావించారు. ఇదే విషయంపై తన సన్నిహితులతో ఇటీవల రహస్యంగా భేటీ అయిన సదరు మాజీ మంత్రి… జనవరిలో వైసీపీ చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే ఈ మాజీ పీసీసీ నేత కూడా చెల్లెలు నాయకత్వానికి గుడ్ బై చెప్పేసి… అన్న సారధ్యంలోని వైసీపీలే చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ మాజీ మంత్రి వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.