వై నాట్ పులివెందుల.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనంలోకి బాగా వెళ్లిన నినాదం.. వై నాట్ 175కి పోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రచారం చేసిన నినాదం. అప్పట్లో కొంతమేర సక్సెస్ కాగా.. ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికలతో పులివెందుల కోటకు బీటలు వారుతున్నాయి. జగన్ రెడ్డి ఇలాకాలో తెలుగు తమ్ముళ్లు భారీగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. పులివెందుల జనం ఎలా సైకిల్ ఎక్కుతున్నారు.
తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను ఒకటి అంటా.. ఇదీ మామూలు సామెత కాదు. ఇందులో సరసం ఎంత ఉందో.. బాగా ఆలోచిస్తే సీరియస్‌నెస్ కూడా అంతే. చంద్రబాబును రాజకీయంగా జీరో చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వేసిన ప్లాన్… ఇప్పుడు దశలవారీగా బూమరాంగ్ అవుతోంది. వైసీపీ పాలన చరమాంకంలో ప్రచారానికి వచ్చిన నినాదాల్లో వై నాట్ పులివెందుల కూడా ఒకటేనని చెప్పాలి. ఆ దెబ్బకు పులివెందుల సహా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలోనే వైసీపీ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు కట్ చేసి చూస్తే సాగునీటి సంఘాల ఎన్నికలు వైసీపీని చావు దెబ్బకొట్టాయి.
Also Read : ఎవడు ఆపినా పోలవరం ఆపను… నా టార్గెట్ అదే: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు 3 స్థాయిల్లో జరుగుతాయి. చెరువులు, పంట కాల్వల కింద సాగునీటిని వాడుకునే రైతులతో ప్రాథమిక స్థాయి నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిపైన డిస్ట్రిబ్యూటరీ కాల్వల స్థాయిలో రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రాజెక్టు స్థాయిలో మూడో దశ ఎన్నికలుంటాయి. ప్రాథమిక స్థాయి ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ ఈ సంఘాలను కూటమి గెలుచుకొంది. స్థానిక పరిస్థితులను బట్టి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ తమలో తాము సర్దుబాటు చేసుకొని వీటిని గెలుచుకొన్నాయి. కడప జిల్లాలో 203 నీటి సంఘాలు ఉండగా కూటమి పార్టీలకు చెందిన వారు 202 సంఘాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వగ్రామం గుండ్లకుంట-3లో మాత్రం వైసీపీ మద్దతుదారులు గెలిచారు. అక్కడ టీడీపీ పోటీ పెట్టలేదు. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకొంది. వైఎస్ కుటుంబ స్వగ్రామం బలపనూరు కూడా టీడీపీ ఖాతాలోకే వెళ్లింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కొన్ని రోజులుగా పులివెందులలో మకాంవేసి ఈ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నం చేసినా ఆ పార్టీ నేతలు ఎక్కడా పోటీ కూడా చేయలేదు. వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పులివెందులలో ఈ పరిస్ధితి నెలకొనడం ఇదే మొదటిసారి. దీనితో అవినాశ్ రెడ్డి లబోదిబోమన్నారు. ఇదంతా టీడీపీ కుట్ర అని వాపోయారు. మొత్తానికి పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి నాయకత్వంలో టీడీపీ శ్రేణులు… విపక్ష వైసీపీ నేతలకు ముచ్చెమటలు పోయించారు. పులివెందుల రైతులు అవినాశ్ రెడ్డిని గుడ్డలిప్పదీసి జగన్ రెడ్డి ముందు నిలబెట్టారని రవి అన్నారు.
పులివెందుల విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. టీడీపి శ్రేణులు కనీసం మూడు దశాబ్దాల పాటు శ్రమించి, వైసీపీ చేతుల్లో దెబ్బలుతిని పోరాడిన తర్వాతే ఇప్పుడు సాగునీటి సంఘాల విజయం సునాయాశమైంది. అదీ కూడా 2024 ఎన్నికల ముందు వైసీపీ చేసిన ఓవరాక్షన్‌కు సమాధానంగా టీడీపీ వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో పైచేయిగా నిలుస్తూ… ఇప్పుడు విజయ పరంపర మొదలు పెట్టారు. జగన్ పాలనా కాలంలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అక్కడ దండోపాయంతో స్థానిక సంస్ఖల ఎన్నికల్లో గెలిచింది. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని టీడీపీ అధినేతను అసలు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలోనే అంగళ్లు ఘటన కూడా నమోదైందని చెప్పాలి. వైనాట్ 175.. వై నాట్ కుప్పం అంటూ టీడీపీ కేడర్‌ను వైసీపీ బ్యాచ్ తీవ్ర భయాందోళనలకు గురి చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్నది కూడా తమ అజెండాగా ప్రకటించుకున్నారు. అప్పుడే తీవ్ర ఆగ్రహానికి లోనైన చంద్రబాబు, వైసీపీ వారి నినాదాన్ని వాళ్లకే అప్పజెప్పాలని నిర్ణయించారు. 2023 ఆగస్టు ప్రాంతంలో వై నాట్ పులివెందుల అని చంద్రబాబు నినదిస్తే… టీడీపీ శ్రేణులు ఆనంద పారవశ్యంతో కేరింతలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను ఓడించి తీరుతామని వారు ప్రతిజ్ఞ కూడా చేశారు..
Also Read : ఎన్నాళ్లీ జాప్యం… ఎందుకీ ఆలస్యం…?
వైనాట్ పులివెందుల అప్పట్లో టీడీపీకి ప్రధాన నినాదమైంది. ఎన్నికల నాటికి అది ప్రజా ఉద్యమంగా ప్రారంభమైంది. పులివెందులలో జగన్‌ను నేరుగా ఓడించలేకపోయినా.. ఆయన మెజార్టీని తగ్గించడం ద్వారా పులివెందులను ఖాళీ చేయించే తొలి అడుగు వేసినట్లయ్యింది. పులివెందులలో జగన్‌కు 2019లో 73 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. 2024 నాటికి అది 61 శాతానికి తగ్గింది. 2014లో జగన్‌కు వచ్చిన 64 శాతం కంటే కూడా ఈసారి మూడు శాతం తగ్గాయంటే.. పులివెందుల జనంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరి సారిగా 2009లో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేసినప్పుడు కూడా 71 శాతం ఓట్లు… దానితో పోల్చుకుంటే ఈ సారి జగన్ బలం పది శాతం పైగా పడిపోయిందనే చెప్పాలి. జగన్ పట్ల, ఆయన నిర్ణయాల పట్ల పులివెందుల జనంలో వచ్చిన వ్యతిరేకతా భావానికి ఇది నిదర్శనమైతే… చంద్రబాబు లేవనెత్తిన వై నాట్ పులివెందుల నినాదానికి ప్రత్యక్ష ఫలితంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఒక్క పులివెందులే కాదు.. వైఎస్ఆర్ జిల్లాలో కూడా వైసీపీ పూర్తిగా ఖంగుతున్నది. పులివెందుల నియోజకవర్గం భాగమైన కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ అభ్యర్థి అవినాశ్ రెడ్డికి వచ్చిన ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2019 ఎన్నికల్లో అవినాశ్‌కు ఏకంగా 64 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి మాత్రం 46 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి భుపేష్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయి. పది శాతం ఓట్లు సాధించిన వైఎస్ షర్మిల పోటీ చేయకుండా ఉంటే… అవినాశ్ ఓడిపోయేవారని ఒక వాదన ప్రచారంలో ఉంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కడప జిల్లాలోనూ, పులివెందులలోనూ వైసీపీ దెబ్బతినడానికి కారణమని భావిస్తున్నారు. అంతకు మించి వై నాట్ పులివెందుల నినాదం పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల కాలంలో జగన్ రెడ్డి పార్టీ మరింతగా దిగజారింది. జనంలో పాపులారిటీని పూర్తిగా కోల్పోయిందనేందుకు సాగునీటి సంఘాల ఎన్నికలనే ప్రామాణికంగా తీసుకోవాలి. అదే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతోంది. ఇప్పటికిప్పుడు పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరిగితే జగన్ రెడ్డి ఘోర పరాజయం పాలవుతారని టీడీపీ నేతలు సవాలు చేస్తున్నారు.