కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి ఆలయంలో దేవదేవునికి ఉదయాస్తమానం వరకు సుప్రభాతం మొదలు పవళింపు వరకు వివిధ రకాల సేవలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి రోజు తెల్లవారు జామున 3.30 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని మేలుకొలుపుతారు. ఆ సేవ కోసం భక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓ వైపు సుప్రభాతం పఠిస్తుండగా… మరోవైపు అంగ ప్రదక్షిణ నిర్వహిస్తారు. అయితే నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.
Also Read: సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త సరికొత్త రికార్డు.. కారణమేంటి?
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.
ధనుర్మాసం వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలపై కూడా టీటీడీ స్పష్టం చేసింది.
Also Read: టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?
పది రోజుల పాటు ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపింది. గతేడాది సుమారు 2 లక్షల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని… ఈ ఏడాది కూడా పది రోజుల పాటు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పది రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ కూడా ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి తర్వాత రావడంతో… రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా భక్తులు తిరుమల వస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.