మెగా, అల్లు కుటుంబాల మధ్య అంతర్గత విబేధాలున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. పుష్ప సినిమా హిట్ నుంచి అల్లు కుటుంబం మెగా ఫ్యామిలీ అంటి ముట్టనట్లు ఉందనేది వాస్తవం. ఇంకా చెప్పాలంటే… చాలా సందర్భాలు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ పేరును అల్లు అర్జున్, అరవింద్ ప్రస్తావించలేదు. ఇక ఈ వివాదం 2024 ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంతో అగ్నికి ఆజ్యం తోడైనటైంది. ఓ వైపు వైసీపీకి వ్యతిరేకంగా పవన్ పోరాటం చేస్తుంటే… బన్నీ ఎలా వెళ్తాడని అంతా ప్రశ్నించారు.
Also Read: టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?
ఇక కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత, పవన్ హైదరాబాద్ పర్యటన, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఎక్కడా అల్లు కుటుంబం కనిపించలేదు. పైగా కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా గ్రీటింగ్స్ చెప్పలేదు. ఆ తర్వాత మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఫ్యాన్స్ కోసం ఎక్కడికైనా వస్తా.. ఎవరికీ భయపడను అంటూ వ్యాఖ్యానించారు. ఇక పుష్పా 2 ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎక్కడా మెగా ఫ్యామిలీ కనిపించలేదు. అలాగే సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యామిలీ తరఫున సాయి ధరమ్ తేజ్ తప్ప మరొకరు గ్రీటింగ్స్ చెప్పలేదు.
దీంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది అనేది తేలిపోయింది. అయితే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ వెనుక పవన్ కల్యాణ్ కుట్ర ఉందని వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేసింది కూడా. అయితే బన్నీ అరెస్టు విషయం తెలుసుకున్న మెగా ఫ్యామిలీ ఆఘమేఘాల మీద అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. చిరంజీవి, నాగబాబు స్వయంగా వచ్చి విషయం తెలుసుకున్నారు. ఇక అల్లు అర్జున్ విడుదలైన తర్వాత మేనత్త సురేఖ వెళ్లారు. బన్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు.
Also Read: బన్నీతో టీడీపీకి గొడవలున్నాయా….?
ఆ సమయంలో పక్కనే ఉన్న అల్లు అరవింద్… తన సోదరిని చెయ్యి పట్టుకుని స్వయంగా లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అల్లు అర్జున్ దాదాపు మూడేళ్ల తర్వాత కుటుంబ సమేతంగా చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లాడు. దాదాపు గంట పాటు విడివిడిగా గడిపారు. జరిగిన విషయాన్ని వివరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా పుష్ప 2 సినిమాలో బన్నీ యాక్షన్‌కు కాంప్లిమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి మూడేళ్ల తర్వాత మెగా ఫ్యామిలి ఇంటికి బన్నీ కుటుంబ సమేతంగా వెళ్లడంతో మెగా – అల్లు కుటుంబాల మధ్య వివాదం ముగిసిందనే మాటతో ఇప్పుడు సినీ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.