వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2024 ఏ మాత్రం కలిసి వచ్చినట్లుగా లేదు. ఈ ఏడాది ఆరంభం నుంచి అన్నీ ఎదురుదెబ్బలే. ఘోర ఓటమితో ఇప్పటికే బిక్కచచ్చిపోయిన జగన్‌కు ఏడాది చివర్లో కూడా షాకులు తగులుతున్నాయి. నిన్నటి వరకు మా జగనన్న అంటూ గొప్పగా పొగిడిన నేతలంతా… ఇప్పుడు బై బై అనేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే… చివరికి జగన్‌కు ముఖం చూపించేందుకు కూడా సుముఖత చూపడం లేదు. ఇప్పటికే మాజీ మంత్రులు ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నేతలు రాజీనామా చేయగా… తాజాగా మరో మాజీ కూడా గుడ్ బై చెప్పేశారు.
Also Read : అమరావతి నిర్మాణం అప్పటి వరకు పూర్తి కాదా…?
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన అవంతి… 2009లో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగారు. ఆ తర్వాత 2014లో సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరఫున అనకాపల్లి పార్లమెంట్ తరఫున పోటీ చేసిన గెలిచారు. ఐదేళ్లు జగన్‌పై విమర్శలు చేసిన అవంతి శ్రీనివాస్… సరిగ్గా 2019 ఎన్నికలప్పుడు వైసీపీలో చేరారు. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మొదటి విడత మంత్రివర్గంలోనే అమాత్య పదవి పొందారు అవంతి.
Also Read : మాట మీద నిలబడని జగన్…!
రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శిష్యుడిగా గుర్తింపు పొందిన అవంతి… ఒకదశలో గంటాతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా విమర్శలు చేశారు. గంటా వైసీపీ చేరుతారనే పుకార్ల నేపథ్యంలో… వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో విబేధించారు కూడా. అయితే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో అవంతి పదవి పీకేశారు జగన్. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు కూడా. సరిగ్గా ఎన్నికలకు ముందే జనసేనలో చేరతారనే పుకార్లు షికారు చేశాయి కూడా. కానీ అవంతిని జగన్ ఒప్పించడంతో తప్పని పరిస్థితుల్లో భీమిలి నుంచి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుపైనే పోటీ చేశారు. అయితే రాష్ట్రంలోనే భారీ తేడాదో ఏకంగా 90 వేల ఓట్ల తేడాతో ఓడిన నేతగా రికార్టు తెచ్చుకున్నారు. ఓడిన తర్వాత ఆరు నెలలుగా పూర్తిగా సైలెంట్ అయిన అవంతి… తాజాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో టీడీపీ, జనసేన అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అవంతి.. నెక్ట్స్ ప్రయాణం ఏమిటనేది ప్రస్తుతానికి వెల్లడించలేదు.