ఆంధ్రప్రదేశ్ లో కొత్త డీజీపీ కొత్త ఏడాదిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం డీజీపీగా విధులు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమల రావు ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు. ఇక ఆయన పదవీ కాలం కూడా పొడిగించే అవకాశం లేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గతంలో చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించిన సందర్భాలు ఉన్నాయి… కానీ డీజీపీ పదవీ కాలం మాత్రం గతంలో ఎప్పుడూ పొడిగించలేదు. ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం సమర్ధవంతంగానే విధులు నిర్వహిస్తున్నారు. పలు కీలక కేసులను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Also Read: ఇంకా లేట్ వద్దు… పిలిచేద్దాం అంటున్న టీడీపీ అధిష్టానం
దీనితో మళ్ళీ ఆయననే కొనసాగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్ పై సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారుల్లో అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు. ఎన్నికల సంఘం… ఎన్నికల టైంలో అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించింది. సీనియర్ కాకపోయినా ఆయనను అప్పట్లో పదవిలో కూర్చోబెట్టారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటి స్థానంలో ఉన్న ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు డీజీపీగా అవకాశం ఇచ్చారు. ఇదంతా ఎన్నికలు సజావుగా సాగడంలో బాగంగా చేసినట్లు భావించాలి.
Also Read: ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లపాటు గుప్తానే డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకే అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. హరీష్ కుమార్ కంటే ముందు… అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అంజనా ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అధారటీ చైర్మన్ గా ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ కు చైర్మన్ గా ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం కల్పించే సూచనలు కనపడుతున్నాయి. హరీష్ కంటే వీరిద్దరే సీనియర్లు కావడంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు, నేరాలు అరికట్టాలి అంటే డిజిపి నియామకం కీలకం కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.