వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల ప్రజలను ఓట్లు అడిగిన జగన్‌కు… ప్రజలు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చేది లే.. అని ఓటుతో జవాబు చెప్పారు. దీంతో వైసీపీ పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలకు ఇప్పుడు అర్థమైనట్లుంది. మనం బాగుండాలంటే… జగన్‌కు దూరంగా జరగాలనే సూత్రాన్ని ఇప్పుడు వైసీపీలో కీలకనేతలంతా పాటిస్తున్నారు. నిన్నటి వరకు జై జగన్ అన్న నేతలు… ఇప్పుడు బై బై జగన్ అని పాట పాడుతున్నారు. ఇలాంటి వారి జాబితాలో తాజాగా మరో మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాథుడే కరువు…!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో రాజకీయాల్లోకి ప్రవేశించిన సుచరిత… 2006లో తొలిసారి జెడ్‌పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో తొలిసారి ఆమెకు ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్. ఆ ఎన్నికల్లో గెలిచిన సుచరిత… 2012లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. నాటి నుంచి వరుసగా వైసీపీ తరఫున గెలుస్తూనే ఉన్నారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే… మేకతోటి సుచరితను హోమ్ మంత్రి చేశారు జగన్. అయితే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఆమెను పదవి నుంచి తప్పించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సుచరిత… ఒకదశలో రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే జగన్ బుజ్జగించడంతో సర్దుకున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల్లో సుచరితకు జగన్ షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు కాకుండా… తాడికొండకు బదిలీ చేశారు. రాజధాని ప్రాంతం కావడం… పైగా ఏ మాత్రం పట్టులేకపోవడంతో.. టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ చేతిలే సుచరిత ఓడిపోయారు. నాటి నుంచి జగన్‌కు దూరంగానే ఉన్నారు. రెండు మూడు సార్లు గుంటూరు జిల్లాలో జగన్ పర్యటించినప్పటికీ… ఆమె అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో సుచరిత పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం మొదలైంది.
Also Read : జగన్ కి వాసిరెడ్డి పద్మ సంచలన సలహా
ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, ఎంపీలు మోపిదేవి, బీద, కృష్ణయ్య వంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో… సుచరిత కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం గుంటూరులో తన నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సుచరిత సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. “మేము బాగుండాలంటే… మీరు పార్టీ మారాల్సిందే..” అని మెజారిటీ కార్యకర్తలు సుచరితకు సూచించినట్లు తెలుస్తోంది. ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తీరులో మార్పు రాలేదని… మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ కో ఆర్డినేటర్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని కార్యకర్తలు విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉంటే రాజకీయంగా ఎలాంటి అవకాశం ఉండదని… కాబట్టి పార్టీ మారాలంటూ మేకతోటి సుచరితకు ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, అభిమానులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే… టీడీపీలోకి వెళ్లాలా… లేక జనసేనలో చేరాలా అనే విషయంపై మాత్రం సుచరిత ఇంకా నిర్ణయం తీసుకోలేదని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా… క్రిస్మస్ లేదా సంక్రాంతి నాటిక సుచరితి పార్టీ మార్పు ఖాయం అంటున్నారు అభిమానులు.




