తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల తీరు ఇప్పుడు అధినేతకు తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో నేతలను మార్చేశారు. అదే సమయంలో పాత వారికి కీలక హామీలు కూడా ఇచ్చారు. ఇక ఎన్నికలకు ముందు నుంచే వైసీపీని వ్యతిరేకించిన కొందరు నేతలు… ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అలాంటి వారికి కూడా చంద్రబాబు టికెట్ కేటాయించారు. దీంతో ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న నేతలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
Also Read : డ్రోన్ ఎగిరితే చాలు… పోలీసులే షాక్ అవుతున్నారు…!
శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కొత్తవారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. మాజీలుగా ఉన్న కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి స్థానంలో మామిడి గోవిందరావు, గోండు శంకర్‌కు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు. అయితే గోవిందరావు, శంకర్‌కు టికెట్లు ఇవ్వటాన్ని అప్పట్లో కలమట, గుండ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. స్వయంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు కూడా. పదవులిస్తామని బాబు హామీ ఇచ్చారు. అలాగే మైలవరం నియోజకవర్గం టికెట్ కూడా దేవినేని ఉమాను కాదని వసంత కృష్ణప్రసాద్‌కు కేటాయించారు.
నిడదవోలు టికెట్ కూడా బూరుగుపల్లి శేషారావును కాదని జనసేన నేత కందుల దుర్గేష్‌కు ఇచ్చారు. గెలిచిన తర్వాత మంత్రిని చేశారు. గుంతకల్ నియోజకవర్గం టికెట్ కూడా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్త, పత్తి హిమబిందును కాదని మాజీ మంత్రి గుమ్మనూరి జయరామ్‌కు ఇచ్చారు. తిరుపతి టికెట్ కూడా సుగుణమ్మకు కాకుండా ఆరణి శ్రీనివాసులుకు కేటాయించారు. రాజంపేటలో చెంగల్రాయుడును కాదన్నారు. దీంతో సీట్లు త్యాగం చేసిన నేతలంతా అప్పట్లో కాస్త గుర్రుగా ఉన్నారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలైనా సరే… ఇప్పటికీ చాలా చోట్ల మాజీ, తాజాల మధ్య సయోధ్య కుదరలేదు.
Also Read : మరో మాజీ ఎమ్మెల్యేకి ఎర్త్ పెట్టిన బాబు సర్కార్
గుండ లక్ష్మిదేవి ఎన్నికల ముందే విదేశాలకు వెళ్లిపోయారు. కలమట కూడా నాటి నుంచి సైలెంట్ అయ్యారు. దేవినేని ఉమాను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. సుగుణమ్మ విషయంలో కూడా చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇక రాజంపేటలో చెంగల్రాయుడు వర్గం టీడీపీ అధినేతపై గుర్రుగా ఉంది. అయినా సరే.. ఇప్పటి వరకు అక్కడ ఇంఛార్జ్ ఎవరనే విషయం బాబు ప్రకటించలేదు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య ఏమాత్రం సమన్వయం లేదు. దీంతో కిందిస్థాయి కేడర్ మొత్తం ఎవరి మాట వినాలనే గందరగోళంలో ఉంది. పాత నేత వెంటే ఉంటే… ఎలాంటి ఉపయోగం ఉండదు… కొత్త నేత వెంట తిరిగితే… పాత వారితో ఇబ్బందులు… ఇలాంటి డైలమాలో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.