ఒక అంశం చంద్రబాబును పదేపదే విసిగిస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి టీడీపీ నేతలపై ప్రధానంగా వస్తున్న ఆరోపణలు ఇసుక, మద్యం మాఫియా. వైసీపీ ఓటమికి ప్రధానంగా ఇసుక, మద్యం మాఫియా అంశాలే కారణం. ఐదేళ్ల పాటు ప్రజలకు ఇసుకను దూరం చేసిన ఘనత జగన్ సర్కార్‌కే దక్కుతుంది. అలాగే నాసిరకం మద్యంతో పాటు.. ఇష్టం వచ్చిన బ్రాండ్‌లు రావడం పట్ల మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలే వైసీపీ ఓటమిని శాసించాయి. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల… ధర కూడా ఆకాశాన్ని అంటటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.
Also Read :వర్రా రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే విషయాలు
చివరికి పనులు లేక భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లారు కూడా. దీంతో సామాన్యులు జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇప్పుడు ఇదే ఇసుకతో అక్రమార్జన చేస్తున్నారని కూటమి ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నూతన ఇసుక విధానాన్ని చంద్రబాబు సర్కార్ అమలులోకి తీసుకువచ్చింది. ఇసుకను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త పాలసీపై ఇప్పటికే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ఇసుకతో టీడీపీ నేతలు అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కూడా.
అలాగే నూతన మద్యం పాలసీపై కూడా ప్రజాప్రతినిధులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం వ్యాపారస్తులను కూటమి ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రెండు అంశాలపై చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇదే అంశంపై వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా సరే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీంతో మరోసారి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ పీకారు. ఇసుక, మద్యం జోలికి ఎమ్మెల్యేలు వెళ్లొద్దన్నారు.
Also Read :జగన్ ని నమ్ముకుంటే తమ్మినేనికి పట్టిన గతే అందరికీ..!
ఉచిత ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెబితే వెంటేనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఇసుక పాలసీలను సరిగ్గా చదివారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ముందు మీరు చివరి వరకు క్షుణ్ణంగా చదివి.. అందులో లోపాలను గుర్తించాలన్నారు. ఉచిత ఇసుక వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే పర్యాటక రంగం అభివృద్ధిపై ఎన్టీయే సమావేశంలో చర్చించారు. నియోజకవర్గాల్లో పర్యాటక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.