వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంటి పోరు తారస్థాయికి చేరుకుంది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. వాటికి హాజరు కావాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు సభకు పోకుండా బయటే ప్రెస్ మీట్ పెడతారంట. ఇప్పటికే ఇదే అంశంపై జగన్ పార్టీ నేతలు సమాధానం చెప్పడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇప్పుడు జగన్ సొంత చెల్లెలు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఇదే అంశంపై విమర్శలు చేశారు. అసలు జగన్ తీరు చూస్తుంటే చిన్నపిల్లలు చాక్లెట్ కోసం మారాం చేస్తున్నట్టు ఉందని సెటైర్ వేశారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లు వేసిందని ప్రశ్నించారు షర్మిల. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా జగన్ తీరు ఉందన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది ఇంట్లో కూర్చుని సొంత మైక్ లో మాట్లాడుకోవడానికి కాదన్నారు. మీ స్వయంకృతాపరాధం వల్లే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని.. అయితే ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అని అనటం అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమన్నారు షర్మిల.
Also Read : భయమా.. వ్యూహమా?
అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం అని మరోసారి గుర్తు చేశారు షర్మిల. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం మీ చేతిలో ఉంది అంటూ షర్మిల గుర్తు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యమైందని షర్మిల విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానడం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్షం లేకపోతే సభలోని ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం అన్నారు.
1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చాయని… అయినా సరే కుంగిపోలేదన్నారు. హోదా కావాలని మీ మాదిరి మారం చేయలేదన్నారు. 26 మంది సభ్యులతోనే సభలో ప్రజల పక్షంగా నిలబడ్డారని.. ఎన్నో సమస్యలపై నాటి టిడిపి ప్రభుత్వాన్ని నిలదీసినట్లు గుర్తు చేశారు.
Also Read : తమదాక వచ్చాకే నొప్పి తెలిసిందా..!
ఇక 2014 ఎన్నికల్లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా… 2019 ఎన్నికల్లో 52 సీట్లే వచ్చినా… ప్రతిపక్ష హోదా కావాలని కాంగ్రెస్ అడగలేదు అన్నారు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సభలో ప్రజా సమస్యలపై మోడీ సర్కార్ ను నిలదీశారని షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి వెళ్లాలని.. గౌతమి ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ షర్మిల సూచించారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము ధైర్యం లేకపోతే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి అంటూ… సొంత అన్న జగన్ కు షర్మిల చురకలంటించారు.