ఎన్నికల్లో ఓడి ఆరు నెలలు కూడా కాలేదు… అధికారం కోల్పోయి సరిగ్గా 150 రోజులు గడవలేదు… ఇంతలోనే మరోసారి ఎన్నికల మాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్లు సమయం ఉంది. కానీ జగన్‌తో పాటు వైసీపీ నేతలంతా కూడా ఇప్పటి నుంచే ముందస్తు ఎన్నికలు వస్తాయని… అందుకు నేతలు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలంటూ క్యాడర్‌ను యాక్టివ్ మోడ్‌లో ఉంచేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇందుకోసం అవకాశం వచ్చిన ప్రతిసారి జమిలి ఎన్నికలంటూ కొత్త పాట పాడుతున్నారు వైసీపీ నేతలంతా. అయితే వైసీపీ నేతల తీరుపై సొంత పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీకి ఈ ఏడాది మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4 ఫలితాలు వచ్చాయి. వీటిల్లో కనీవినీ ఎరుగని రీతిలో కూటమి సర్కార్ 164 స్థానాల్లో గెలవగా… వై నాట్ 175 అంటూ ఎన్నికలకు ముందు గొప్పలకు పోయిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. చివరికి ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టుకు వెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి పదవికి దూరమై పట్టుమని పది నెలలు కూడా పూర్తికాక ముందే ఇప్పటి నుంచే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అక్టోబర్ 18న జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు జగన్. ఇక రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే మాట అన్నారు.
Also Read : బాబు గారు… సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడిస్తారు..?
ఇక చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే మాట అన్నారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి… అందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. వాస్తవానికి జమిలీ ఎన్నికలపై పార్లమెంట్‌లో ఇంకా బిల్లు పాస్ అవ్వాల్సి ఉంది. చర్చ కూడా జరగలేదు. ఇంతలోనే జమిలీ ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటూ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి కీలక నేతలంతా గుడ్ బై చెప్పేశారు. ఇక అదే సమయంలో గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారంతా కేసుల భయంతో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు.
Also Read : మంత్రి అనిత పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్
ఇక గతంలో చేసిన అక్రమాలకు కొందరు నేతలు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ క్యాడర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఐదేళ్ల పాటు గ్రామాల్లో జులుం చెలాయించిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఇక దాడులు, హత్యలు చేసిన వారు… గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాంటి వారికి ధైర్యం చేపేందుకు… పార్టీ కార్యక్రమాల్లో తిరిగి పాల్గొనేందుకు ఇలా జమిలీ ఎన్నికలంటూ మాయ మాటలు చెబుతున్నారనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆరు నెలలు కూడా కాక ముందే… జగన్‌కు సీఎం కుర్చీపై మోజు మొదలైందని… అందుకే ఇలా ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా… క్యాడర్‌లో జోష్ నింపేందుకు జగన్ చేస్తున్న ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.