ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకుల ఆకర్షణ కోసం మరింత నూతనంగా ప్రయత్నిస్తోంది. పర్యాటక శాఖ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ పర్యాటక శాఖ ప్రస్తుతం హెలీ టూరిజమ్‌తో మరో వినూత్న పధకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో విమానాశ్రయం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందు దీనిని ప్రవేశపెట్టి తర్వాత రాష్ట్రమంతా అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఏ వనరును వదులుకోకూడదు అని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. అందులో పర్యాటక రంగానికి విదేశీ మారకం ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పర్యాటక విధానం కాకుండా, కొత్త పద్ధతుల ద్వారా పర్యాటకులను ఆకర్షించి… ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జల క్రీడలు, బోటింగ్, హెరిటేజ్ టూరిజమ్ ప్రవేశ పెట్టిన ఏపీ సర్కార్… ఇప్పుడు హెలీ టూరిజమ్ వైపు అడుగులు వేస్తోంది. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రి ప్రాంతంలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించారు.
ఈ సమయంలో భారీ స్పందన రావడంతో శ్రీశైలంలో కూడా ప్రయోగాత్మకంగా నిర్వహించారు. కేవలం రూ.2 వేలకు గంట పాటు గోదావరి నదిపై విహారం ఏర్పాటు చేశారు. గోదావరి అందాలతో పాటు పాపికొండలు, పోలవరం ప్రాజెక్టు పనులను పై నుంచి వీక్షించే అవకాశం కల్పించడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు నల్లమల అడవి అందాలను కూడా చూసే అవకాశాన్ని కేవలం రూ.1,500 కే కల్పించారు. భారీ స్పందన రావడంతో హెలీ టూరిజమ్ పై పర్యాటక శాఖ దృష్టి సారించింది.
Also Read : రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ముందుగా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి నగరాల్లో హెలీ టూరిజమ్ మొదలుపెట్టాలని పర్యాటక శాఖ భావిస్తోంది. విశాఖలోని ఉడా పార్క్ నుంచి నగరం అందాలు చూపించి… బీచ్ అందాలు, కైలాస గిరి ప్రాంతాలపై చూపాలని నిర్ణయించారు. అలాగే విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి కృష్ణా నది, ఉండవల్లి గుహలు, అమరావతి చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి గోదావరి అందాలు, కోనసీమ అందాలను చూపేంచేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే విధముగా కర్నూలు, కడపలో కూడా హెలీ టూరిజమ్ తీసుకురావాలని భావిస్తున్నారు.
దీని కోసం ఇప్పటికే ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్, ఎయిర్ ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపారు. హెలీ టూరిజమ్ కోసం డీజీసీఏ అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో విభిన్న పర్యాటక సంపద ఉందని… అందులో భాగంగా హెలీ టూరిజమ్ లాంటి కొత్త విధానాలతో పర్యాటకులను ఆకట్టుకుంటే ఆదాయం పెరుగుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేయాలి అంటే విదేశీయులను పెద్ద సంఖ్యలో ఆకర్షించాలని పర్యాటక శాఖ భావిస్తోంది. విదేశాల్లో ఉండే హెలి టూరిజం ఇప్పుడు ఏపీలో కూడా అందుబాటులోకి రానుంది. మిడిల్ క్లాస్ వారికి కూడా అందుబాటు ధరలో దీనిని ఉంచాలని అటు పర్యటక శాఖ, పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది.
గత ఐదేళ్లు పర్యాటక రంగాన్ని జగన్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఏదో మొక్కుబడిగా ఈవెంట్లు నిర్వహించిన గత ప్రభుత్వం… మంత్రి రోజా పుట్టిన రోజు వేడుకలను కూడా పర్యాటక శాఖ ఖాతాలోనే నిర్వహించారు. దీంతో రాష్ట్ట్రానికి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇప్పటికే టెంపుల్ టూరిజం ప్రారంభించిన ఏపీ సర్కార్… త్వరలో హెలీ టూరిజమ్ ద్వారా మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది.