దసరా పండుగకు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దుర్గాష్టమి రోజు సరిగ్గా అర్థరాత్రి 12 గంటల తర్వాత పట్టణ వాసులు అమ్మవార్ల ఆలయాలకు తరలివస్తారు. అక్కడ ప్రారంభమయ్యే కళారాల ఊరేగింపు చూసేందుకు బారులు తీరుతారు. భీకరంగా నాలుక తెరుచుకున్న శక్తి స్వరూపిణులు నగరోత్సవం చేస్తుంటే చూసే వారి ఆనందానికి ఎల్లలు ఉండవు. దుర్గాష్టమి, మహార్నవమి రెండు రోజుల్లో ఒంగోలు జరిగే కళారాల ఊరేగింపులు తెలుగునాట ఎంతో ప్రత్యేకం.
దసరా శరన్నవరాత్రులు ఒంగోలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవార్ల కళారాల ఊరేగింపులు తెలుగునాట దసరా ఉత్సవాల్లో ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. భీకరంగా నాలుక తెరుచుకున్న శక్తి స్వరూపిణులు కనకదుర్గమ్మ, పార్వతమ్మ, కాళికాదేవి, బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్థిని, నరసింహస్వామి శిరస్సులను వాహనాల్లో ఉంచి అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తారు.
కళారాల ఊరేగింపు వెనుక భక్తుల నమ్మకం, విశ్వాసం, చరిత్ర ఉన్నాయి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి శృంఖల దుష్ట సంహారం ప్రారంభమైందనేది పండితుల మాట. చండ, ముండాసురులు, మధుకైటభుడు, ధూమ్రాక్షుడు… ఇలా ఒక్కొక్కరు ఆది పరాశక్తి అంశల చేతిలో హతమవుతున్నారు. చివరగా రక్తబీజుడు వంతు వచ్చింది. అయితే బ్రహ్మదేవుని వరం వల్ల రక్తబీజుని శరీరంలోని ఒక్క చుక్క రక్తం నేల మీదపడిత దాని నుండి వేల మంది రక్తబీజులు పుట్టుకు వస్తారు. అమ్మవారు ఎన్నిసార్లు వారిని సంహరిస్తున్నా.. మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నారు. ఇది గ్రహించిన ఆది పరాశక్తి తన నాలుకను యుద్ధ క్షేత్రం మొత్తం చాచింది. రక్తబీజుడు ఒక్క చుక్క రక్తం కూడా నేల మీద పడకుండా జగజ్జనని మొత్తం పీల్చేసి సంహరించింది.
Also Read : బాబు వ్యవహారశైలితో లోకేష్ కి డ్యామేజ్ జరుగుతుందా?
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవేంద్రాదులు అమ్మవారిని స్తుతించడంతో ఆమె శాంతించి ఉగ్రరూపాన్ని ఉపసంహరించింది. అయితే భూలోకవాసినిగా ఉండాలన్న భక్తుల కోరిక మేరకు… సంవత్సరానికి ఒక్కసారి దుష్ట శిక్షణ చేసేందుకు నాలుక తెరిచి ఉన్న శిరస్సు రూపాన్ని శరన్నవరాత్రుల్లో ఊరేగిస్తే చాలని భక్తులకు అనుగ్రహించినట్లు చరిత్ర చెబుతోంది. అలా ప్రసాదించిన శిరస్సు రూపమే కళారం అని పండితులు చెబుతున్నారు.
ఒంగోలు పట్టణంలో మొత్తం ఆరు కళారాలు ఉన్నాయి. బాలాజీరావు పేట పోలేరమ్మ దేవస్థానంలో కనకదుర్గాదేవి సువర్ణరూపంలో, ఏనుగుచెట్టు కూడలిలోని కాళికాదేవి కళారం ఎర్రగా, గంటపాలెం పార్వతీదేవి కళారం పసుపురంగులో, కేశవస్వామిపేట మహిషాసురమర్దిని దేవి కళారం హిరణ్యవర్ణంలో, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పసుపురంగులోని బాలా త్రిపురసుందరి కళారం, తెల్లని నరసింహస్వామి కళారం ఉన్నాయి. సుమారు 400 ఏళ్ల నుంచి ఈ కళారాల ఊరేగింపు కొనసాగుతున్నట్లు పండితులు చెబుతున్నారు. అమ్మవారి శిరస్సులను గూడుబంట్లపై ఉంచి దివిటీలు, తప్పెటలతో ఊరేగింపు చేసేవారు. అమ్మవారి శిరస్సులు పంచలోహాలతో చేయడం వల్ల చాలా బరువుగా ఉంటాయి.
దుర్గాష్టమి రోజున సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు కనకదుర్గాదేవి కళారం ఊరేగింపు ప్రారంభమవుతుంది. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి నగరోత్సవం మొదలవుతుంది. తర్వాత కాళికాదేవి, పార్వతీదేవి, మహిషాసుర మర్థిని, బాలా త్రిపురసుందరీ దేవి కళారాల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హిరణ్యకశివుడి సంహారించిన నరసింహస్వామి అవతారం కూడా అమ్మ నుంచే లభ్యమయిందనేది దేవీతత్వం. అందుకే ఆయనకు కూడా కళారం ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహిస్తారు.