వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతల హడావుడి ఇంకా కళ్ళ ముందే ఉంది. కీలక నేతలుగా చెప్పుకునే చాలా మంది మీడియా ముందు టీడీపీ సర్కార్ ను నానా మాటలు అన్న రోజులు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఆ నేతలు ఎవరూ కూడా పెద్దగా కనపడటం లేదు. అవును.. అప్పుడు జగన్ చెప్పిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన నేతలలో ఇప్పుడు చాలా మంది మీడియాతో మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. అందులో నెల్లూరు జిల్లా నాయకుడు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు.
మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విచ్చలవిడిగా చెలరేగిపోయిన మాట వాస్తవం. అసెంబ్లీ అయినా.. మీడియా పాయింట్ అయినా.. ఎక్కడ మైక్ దొరికితే అక్కడ చాలా గట్టిగా మాట్లాడారు అనీల్ కుమార్ యాదవ్. అసలు ఇప్పుడు ఆయన ఊసే వినపడటం లేదు. కార్యకర్తలకు కూడా అనీల్ కుమార్ యాదవ్ దొరకడం లేదు అని సమాచారం. సొంత నియోజకవర్గంలో నేతలను కూడా కలవడానికి అనీల్ కుమార్ యాదవ్ ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల కొందరు సన్నిహితుల వద్ద తన వైద్య వృత్తి మీద దృష్టి పెట్టాలి అనుకుంటున్నా అని విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నా అంటూ చెప్పారట.
నెల్లూరు జిల్లా నేతలకు అయితే అసలు ఆయన అడ్రస్ కూడా దొరకడం లేదు. పార్టీకి కొందరిని దూరం చేసిన ఆయనపై నిజమైన వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయనను కలిసి కొన్ని విషయాలు తేల్చుకోవాలి అనుకుంటున్నారు. కాని అనీల్ ఆచూకి దొరకడం లేదు. ఇరిగేషన్ శాఖపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ శాఖకు మంత్రిగా చేసిన అనీల్ వాటిపై మాట్లాడేందుకు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఇక స్థానిక సంస్థల్లో గెలిచిన వారు పార్టీ మారాలని అనుకుంటున్నా వారితో కలిసి ఉండండి అని చెప్పే ప్రయత్నం కూడా జరగడం లేదు.
ఎంపీగా పోటీ చేసిన నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చినా వాళ్లకు అండగా నిలిచే ప్రయత్నం చేయలేదు. మాచెర్ల నియోజకవర్గంలో పార్టీకి సరైన నాయకత్వం లేకపోయినా అక్కడ పార్టీ జెండా మోయడానికి ఆ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి కూడా అనీల్ కుమార్ ముందుకు రావడం లేదు. దీనితో అసలు ఉన్నారా లేదా ఎక్కడికి అయినా వేల్లిపోయారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.