ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే అయిదేళ్ళు ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్ళే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. గత అయిదేళ్ళుగా అమరావతి విషయంలో అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వైజాగ్ రాజధాని అంటూ జగన్ సర్కార్ అప్పుడు హడావుడి చేయడంతో ఈ విషయంలో చాలా మందిలో భయం మొదలయింది. ఇక ఇప్పుడు చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు.

రాజధాని అమరావతి కోసం… 15 వేల కోట్లను ప్రపంచ బ్యాంక్ ద్వారా ఇప్పించడానికి కేంద్రం బాధ్యత తీసుకుంటుంది. ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు స్వయంగా రంగంలోకి దిగింది. తాము కేంద్రంతో సంబంధం లేకుండా రుణాలు ఇస్తామని చెప్తోంది. అమరావతి లోనే ప్రపంచబ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలు తిరుగుతున్నాయి. అమరావతి రాజధానికి కేంద్రం ప్రకటించిన 15 వేల కోట్ల రుణాలు ఇస్తామని చెప్తూ…

ఆ రుణాలతో పాటు రాజధాని అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రుణ మంజూరు కు ముందు జరగాల్సిన ప్రక్రియ చేపడుతున్నాయి. లీగల్ ఇష్యూస్ తో పాటు అమరావతి లో పనుల పురోగతి, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బృందాలు క్షేత్ర స్థాయి అధ్యయనం చేస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి తో భేటీ లో రుణ మంజూరు పరిస్థితులపై సంతృప్తి వ్యక్తం చేసాయి బ్యాంక్ లీడ్ టీమ్స్. రేపటి వరకు అమరావతిలోనే లీడ్ టీమ్స్ ఉండే అవకాశం ఉంది. మరోసారి ముఖ్యమంత్రి ని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. అమరావతి విషయంలో స్వయంగా కేంద్రమే జోక్యం చేసుకోవడంతో ప్రపంచ బ్యాంక్ దూకుడుగా అడుగులు వేస్తోంది.