మొన్న ఒంగోలు, నిన్న హిందూపురం, నేడు మాచర్ల… టీడీపీ కైవసం చేసుకుంటున్న మున్సిపాలిటీలు ఇవన్నీ. మీ చేతిలో పవర్ ఉంటే దౌర్జన్యం చేసి లాక్కున్నారు, పవర్ ను వాడుకోవడం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం అంటూ కూటమి సర్కార్… నాలుగు రోజుల నుంచి పక్కాగా ప్రణాళిక ప్రకారం వైసీపీని దెబ్బ కొడుతోంది. అప్పుడు మేము నామినేషన్ వేస్తుంటే దాడులు చేసారు, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తూ వైసీపీ ఆధిపత్యం ఉన్న మున్సిపాలిటీల మీద ఫోకస్ పెట్టింది టిడిపి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని లైట్ తీసుకుంది అనుకునే లోపే వైసీపీ చేతి నుంచి మున్సిపాలిటీలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి.
దామచర్ల జనార్ధన్ సమక్షంలో ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోవడంతో ఒంగోలు మునిసిపాలిటీ టీడీపీ కైవసం అయింది. ఇక హిందూపురంలో బాలకృష్ణ దెబ్బకు నిన్న సాయంత్రం నుంచి కార్పొరేటర్లు టీడీపీలోకి వచ్చేశారు. నేడు మాచెర్లలో వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతున్నారు. ఈ మూడు మునిసిపాలిటీలు టీడీపీ ఖాతాలో పడుతున్నాయి. ఇక కడప మునిసిపాలిటీ మీద కూడా దృష్టి పెట్టింది టీడీపీ. కొందరు కౌన్సిలర్లు అక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. దీనితో అక్కడ టీడీపీ అధిష్టానం ఫోకస్ చేసింది. త్వరలోనే వారిని టీడీపీ గూటికి తీసుకు వచ్చే అవకాశం కనపడుతోంది.
వైజాగ్ కూడా పూర్తి స్థాయిలో టిడిపి కైవసం అవుతుంది. దీని వెనుక బలమైన కారణమే ఉంది. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ వైసీపీ అడ్డం పడే అవకాశం ఉండవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు టీడీపీలోకి రావాలి. కడపలో కొందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బలంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అని గ్రహించిన కూటమి… మున్సిపాలిటీల మీద ఫోకస్ చేసింది. ఇంకెన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటారు అనేది చూడాలి. ఏది ఏమైనా విశాఖ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగ్గినట్లే కనిపించిన టిడిపి, వరసగా మునిసిపాలిటీలు కైవసం చేసుకుంటూ దూకుడు ప్రదర్శిస్తుంది.