ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్ధం కానీ పరిస్థితి కనిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం తవ్వి తీస్తుండటంతో చాలా మంది వైసీపీ నేతలు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. అయితే వీరందరూ ఆసక్తికరంగా జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన చాలా మంది నేతలు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన జనసేనలో చేరేందుకు నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావడం లేదు.
ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ ఆయన ఇవ్వలేదు. జనసేన ఆఫీస్ వద్దకు కూడా వెళ్లి ఆయన చర్చలు జరిపారు. ఇక ఇప్పుడు మరో నేత జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. దీనిపై ఆయన గత కొన్ని రోజులుగా సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు… జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినా తర్వాత మాట్లాడలేదు.
Also Read : దూకుడు పెంచిన లోకేష్.. కొత్త చరిత్రకి శ్రీకారం
పిఠాపురం టికెట్ ను వంగా గీతకు కేటాయించడం పట్ల కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఇప్పుడు వైసీపీలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు కష్టమే అని భావిస్తున్న ఆయన… ఎలా అయినా జనసేనలో చేరాలని కాస్త పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల జగన్ ఢిల్లీ ధర్నాకు దొరబాబు వెళ్ళలేదు. దొరబాబు తన పుట్టినరోజు సందర్భంగా అనుచరులతో భారీ సమావేశం ఏర్పాటు చేయగా స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్‌లో ఎక్కడా కూడా వైసీపీ జెండా కానీ జగన్ ఫోటో లేదు. దీనితో ఆయన వైసీపీకి రాజీనామా చేయడం ఖాయం అని స్పష్టత వచ్చింది. మరి జనసేనలో ఎప్పుడు జాయిన్ అవుతారనేది స్పష్టత రావడం లేదు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో మిగిలేది ఆ కొందరు నాయకులు మాత్రమే అనే విషయం పరిశీలకుల నుంచి వినిపిస్తుంది.