పెళ్లి వేడుకలో నాజూగ్గా, అందంగా కనిపించాలనే ఆశతో ఇటీవల చాలామంది బరువు తగ్గే మందులను ఆశ్రయిస్తున్నారు. అయితే, పెళ్లి ముగిసి ఫొటోలు దిగిన తర్వాత ఈ మందులను అకస్మాత్తుగా ఆపేస్తే శరీరంలో మళ్లీ బరువు పెరగడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి మందులు శరీరంలో ఉన్నంత వరకు ఆకలిని నియంత్రిస్తూ, కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. కానీ మందులు ఆపేయగానే వాటి ప్రభావం తగ్గిపోయి, జీవక్రియల్లో మార్పుల వల్ల మళ్లీ ఆకలి పెరగడం, ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరిక కలగడం సహజంగా జరుగుతుంది.
Also Read : కాలుష్యానికి కారకులెవరు..?
ఈ విషయంపై జరిగిన అంతర్జాతీయ వైద్య పరిశోధనలు కూడా ఆశ్చర్యకరమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. సెమాగ్లుటైడ్ మందులు వాడి 68 వారాల్లో సుమారు 17.3 శాతం బరువు తగ్గిన వారు, చికిత్స ఆపేసిన ఏడాదిలోపే తాము కోల్పోయిన బరువులో మూడింట రెండు వంతులు మళ్లీ పెరిగినట్లు అధ్యయనాల్లో తేలింది. అలాగే టిర్జెపటైడ్ ఆపేసిన వారు కూడా ఏడాది కాలంలో దాదాపు 14 శాతం బరువును తిరిగి పొందారు. కేవలం సంకల్ప బలం లేకపోవడం వల్లే కాకుండా, బరువు తగ్గిన శరీరానికి తక్కువ శక్తి సరిపోవడం, మందుల ప్రభావం తగ్గడం వంటి జీవసంబంధమైన కారణాల వల్ల బరువు వేగంగా పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
Also Read : తల్లయిన సమంత.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..!
కేవలం పెళ్లి దుస్తులు సరిపోవాలనో, తాత్కాలిక అవసరాల కోసమో ఈ మందులను వాడటం సరైన పద్ధతి కాదని, వైద్యుల పర్యవేక్షణలో సరైన ఆరోగ్య కారణాలతోనే వీటిని ప్రారంభించాలని వైద్యులు సూచిస్తున్నారు. మందులు ఆపేయడం వల్ల కేవలం బరువు పెరగడమే కాకుండా, అంతకుముందు నియంత్రణలోకి వచ్చిన రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు మళ్లీ అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఒకవేళ పెళ్లి తర్వాత గర్భం దాల్చాలని ప్లాన్ చేసుకుంటే, సెమాగ్లుటైడ్ వంటి మందులను కనీసం రెండు నెలల ముందే ఆపేయాలని, టిర్జెపటైడ్ వాడేవారు గర్భనిరోధక మాత్రల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


