టాలీవుడ్ బడా నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ ఒంగోలు రెండవ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది పాటు సాధారణ జైలుశిక్షతో పాటు, రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, కేసు విచారణ నిమిత్తం ఫిర్యాదుదారుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేష్ భరించాలని స్పష్టం చేశారు.
Also Read : భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ సంచలనం..!
ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు ప్రాంతానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో బండ్ల గణేష్‌కు గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. సినిమా నిర్మాణ అవసరాల నిమిత్తం వెంకటేశ్వరరావు వద్ద బండ్ల గణేష్ రూ. 95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ బాకీ తీర్చే క్రమంలో తన సొంత నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ఖాతా నుంచి రూ. 95 లక్షల విలువైన చెక్కును జెట్టి వెంకటేశ్వరరావుకు అందజేశారు. అయితే, రుణదాత వెంకటేశ్వరరావు ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది.
Also Read : వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ షాకింగ్ న్యూస్..!
చెక్ బౌన్స్ అయిన విషయాన్ని బండ్ల గణేష్ దృష్టికి తీసుకెళ్లి, డబ్బులు తిరిగి చెల్లించాలని కోరినప్పటికీ ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో మోసపోయానని భావించిన జెట్టి వెంకటేశ్వరరావు న్యాయం కోసం ఒంగోలు కోర్టును ఆశ్రయించి, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పిటిషన్ దాఖలు చేశారు. గత కొంతకాలంగా ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు, బ్యాంకు పత్రాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం బండ్ల గణేష్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయినట్లు నిర్ధారించి తుది తీర్పు ప్రకటించింది. అయితే, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు న్యాయస్థానం ఆయనకు నెల రోజుల గడువు మంజూరు చేసింది. గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్‌కు కోర్టులు శిక్ష విధించగా ఆయన అప్పీల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.


