నవంబర్ నెల నుంచి ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ విధానంలో మార్పులు జరుగుతన్నాయి. అయితే ఆ మార్పులను ప్రజలకు ముందుగానే వివరించకపోతే మాత్రం.. కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత నష్టం జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ రూపంలో వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.4 వేల రూపాయలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే లబ్దిదారులకు అందిస్తోంది. అలాగే దివ్యాంగ పెన్షన్ కూడా 6 వేల రూపాయలను కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారే సరికి వారి ఇంటి వద్దే నేరుగా అందిస్తున్నారు. ప్రతి నెలా ఇది చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న భరోసా అని చెప్పి.. లబ్దిదారులకు అందాల్సిన మొత్తాన్ని లెక్క పెట్టి మరీ ఇస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలు జరగలేదు. దీంతో లబ్దిదారులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు.
Also Read : ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.. ప్రజల కోసం బాలయ్య కీలక నిర్ణయం
అయితే నవంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీలో మార్పులు జరగనున్నాయి. అదే ఇప్పుడు కూటమి పార్టీ నేతలకు పెద్ద సవాల్‌గా మారనుంది. వచ్చే నెల నుంచి వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలకు బదులుగా రూ.3,800 మాత్రమే అధికారులు పంపిణీ చేయనున్నారు. దివ్యాంగ పెన్షన్ రూ.6 వేలకు బదులుగా రూ.5,500 మాత్రమే ఇస్తారు. మిగిలిన నగదును నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వమే జమ చేయనుంది. ఇక్కడే అసలు సమస్య మొదలుకానుంది. లబ్దిదారులకు ఈ విషయంపై సరైన అవగాహన ఇవ్వకపోతే మాత్రం.. కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత నష్టం జరగటం ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది.
2014-19 మధ్య కాలంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. అప్పటి వరకు రూ.200 ఉన్న పెన్షన్‍ను ఏకంగా 5 రెట్లు పెంచారు. ప్రతి లబ్దిదారునికి ఏకంగా రూ. వెయ్యి రూపాయలు అందించారు. 2019 జనవరి నెల నుంచి పెన్షన్‌ను డబుల్ చేసిన చంద్రబాబు.. ఏకంగా 2 వేల రూపాయలను లబ్దిదారుల ఖాతాలో జమ చేశారు. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు సరిగ్గా ప్రచారం చేయలేకపోయారు. ఏదో డ్వాక్రా మహిళలతో ఓ నాలుగు రోజుల పాటు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సరిపెట్టారు. ఇదే అదనుగా భావించిన వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూ.3 వేలు అందిస్తా అని హామీ ఇచ్చారు. దీంతో ఇది నిజమని నమ్మిన ఓటర్లు.. గంపగుత్తగా వైసీపీకి ఓట్లు వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెన్షన్ రూ.3 వేలకు పెంచారు. అయితే దానిని నేరుగా వైసీపీ ప్రభుత్వ వాలంటీర్లు లబ్దిదారులకు అందివ్వటంతో.. పెద్దగా విమర్శలు రాలేదు.
Also Read : ఏపీ లోకల్ పోరు.. ఈసీ రిజర్వేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ..?
అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే.. పెన్షన్ మరో వెయ్యి పెంచి.. ఏకంగా రూ.4 వేలు అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200. మిగిలిన రూ.3,800 కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. కానీ ఇప్పటి వరకు లబ్దిదారులకు ఈ విషయం తెలియదు. పెన్షన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు వృద్ధాప్య పింఛన్‌లో రూ.200, దివ్యాంగ పింఛన్‌లో రూ.500 మినహాయించి.. మిగిలిన సొమ్మును నేరుగా లబ్దిదారులకు అందించనున్నారు. మినహాయించిన సొమ్ము లబ్దిదారుని బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతుంది. అయితే ఈ విషయం వారికి ఇప్పటి నుంచే వివరించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తపైన ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని.. కూటమి ప్రభుత్వం ఎలాంటి కోతలు పెట్టలేదని వివరించాలి.
లబ్దిదారులకు వివరించడంలో కూటమి నేతలు నిర్లక్ష్యం వహించినా, అశ్రద్ధ చూపించినా సరే.. అది కూటమి పాలనపైన పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి నెలా పెన్షన్ అందిస్తున్న టీడీపీ నేతలు డబ్బులు కొట్టేశారనే ఆరోపణలు ఖాయం. ఇక కొందరు అయితే.. మాకు ఇచ్చే డబ్బులు ఎందుకు తగ్గిస్తున్నారంటూ గొడవలు పెట్టుకునే అవకాశం కూడా. మరికొందరు మాత్రం.. మిగిలిన రూ.200, రూ.500 కోసం ఇప్పుడు బ్యాంకు వరకు వెళ్లాలా.. అదేదో వీళ్లే తీసి ఇవ్వొచ్చు కదా.. అని ఇప్పటి నుంచే విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇప్పటి నుంచే కూటమి నేతలు రంగంలోకి దిగకపోతే.. దీని పరిణామాలు తీవ్ర ఫలితాలు చూపించే ప్రమాదం ఉంది.


