ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా అడుగులు వేస్తోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈరోజు అత్యంత కీలకమైన వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఈ రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించేందుకు ఎస్‌ఈసీ రేపు రాజకీయ పార్టీలతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది.
Also Read : ఎన్టీఆర్ కట్టించిన ఇల్లు.. ప్రజల కోసం బాలయ్య కీలక నిర్ణయం
అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం, ఈ నెల 14వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలకు కసరత్తు ముమ్మరం చేయడంతో, మరోవైపు అధికార కూటమి పార్టీలు సైతం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు అమరావతిలో కూటమి అగ్రనేతల అత్యంత కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
Also Read : ఆధార్‌లో పేరు మార్చుకోవాలా? కొత్త నిబంధనలు.. అవసరమైన పత్రాలు ఇవే!
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ఒక తుది నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే క్షేత్రస్థాయిలోనూ పూర్తి సమన్వయంతో దూసుకెళ్లి, స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు, అగ్రనేతల భేటీలు, 14న షెడ్యూల్ విడుదల కానుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. రేపు జరగబోయే రాజకీయ పార్టీల సమావేశంలో ఎస్‌ఈసీ ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా కూటమి శ్రేణులు క్షేత్రస్థాయి ప్రచారానికి సిద్ధం కానున్నాయి.


