ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) ప్రవేశపెట్టింది. పేరు మార్చడానికి గల కారణాన్ని బట్టి సమర్పించాల్సిన పత్రాలు, అఫిడవిట్ నమూనాలను నిర్దేశించింది. దీంతో పేరు అప్‌డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లే ముందు తమకు వర్తించే నిబంధనలు, అవసరమైన పత్రాలపై అవగాహన కలిగి ఉండటం అవసరం.
నమోదు సమయంలో పొరపాటు జరిగితే..
ఆధార్ నమోదు సమయంలో డేటా ఎంట్రీ పొరపాటు వల్ల పేరు తప్పుగా నమోదైతే, దాన్ని సరిచేసేందుకు ప్రత్యేక విధానాన్ని సూచించింది. గతంలో సమర్పించిన గుర్తింపు లేదా సంబంధాన్ని నిర్ధారించే పత్రంలో సరైన పేరు ఉన్న సందర్భాల్లో వయోజనులు అనెక్సర్–బి, మైనర్లు అనెక్సర్–సి నమూనాలో అఫిడవిట్ సమర్పించాలి. వీటితోపాటు UIDAI నిర్దేశించిన గుర్తింపు లేదా సంబంధ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.
Also Read : లోకల్ వార్.. మరో ప్రయోగానికి టీడీపీ ప్లానింగ్..!
వివాహం, విడాకుల అనంతరం ఇంటిపేరు మార్పు
వివాహం తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకున్నా, విడాకుల అనంతరం పూర్వపు ఇంటిపేరును తిరిగి పొందాలనుకున్నా ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. ఈ సందర్భాల్లో అనెక్సర్–డి నమూనాలో అఫిడవిట్‌తోపాటు అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించాలి.
పేరులో ‘అలియాస్’ తొలగించాలంటే..
ఆధార్‌లో ప్రధాన పేరుతోపాటు ‘ఉర్ఫ్’ లేదా ‘అలియాస్’ రూపంలో మరో పేరు నమోదై ఉంటే, వాటిలో ఒక పేరును తొలగించేందుకు ప్రత్యేక ప్రక్రియను అనుసరించాలి. ఒకే పేరును కొనసాగించాలనుకునే వయోజనులు అనెక్సర్–ఈ, మైనర్లు అనెక్సర్–ఎఫ్ నమూనాలో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.
Also Read : ఓటమిపై గంభీర్ షాకింగ్ కామెంట్స్..!
పూర్తి పేరు మార్పునకు గెజిట్ నోటిఫికేషన్
పేరులో గణనీయమైన మార్పులు చేయాలనుకుంటే సాధారణ గుర్తింపు పత్రాలు మాత్రమే సరిపోకపోవచ్చు. ముఖ్యంగా పూర్తి పేరును లేదా మొదటి పేరును పూర్తిగా మార్చే సందర్భాల్లో గెజిట్ నోటిఫికేషన్ అవసరమవుతుంది. దాంతోపాటు పాత పేరు ఉన్న గుర్తింపు పత్రాన్ని కూడా సమర్పించాలి.
బిరుదులు, హోదాల తొలగింపునకు అవకాశం
ఆధార్‌లో పేరుకు ముందు లేదా తర్వాత డాక్టర్, కర్నల్, శ్రీ, శ్రీమతి, మిస్టర్ వంటి బిరుదులు, హోదాలు లేదా సంబోధనలు నమోదై ఉంటే వాటిని తొలగించుకోవచ్చు. ఇందుకు SOPలో పేర్కొన్న విధంగా నిర్దేశిత గుర్తింపు పత్రాలను సమర్పించి సవరణ ప్రక్రియను పూర్తి చేయాలి.
Also Read : రష్యాతో ట్రంప్ సంచలన డీల్.. పాపం ఉక్రెయిన్..!
సంబంధిత అఫిడవిట్ నమూనానే ఉపయోగించాలి
పేరు అప్‌డేట్ కోసం దరఖాస్తు చేసేవారు తమకు వర్తించే కేటగిరీకి అనుగుణంగా అఫిడవిట్, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. పాత అఫిడవిట్ నమూనాలను ఉపయోగిస్తే దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆధార్‌లో పేరు అప్‌డేట్ చేసుకోవడానికి ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. సాధారణంగా పేరును రెండుసార్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ పరిమితి దాటిన తర్వాత మరోసారి మార్పు అవసరమైతే, గెజిట్ నోటిఫికేషన్‌తోపాటు UIDAI నిర్దేశించిన ప్రత్యేక మినహాయింపు ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.


