ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి ఒక్కసారిగా పెరిగింది. ఒకరి తర్వాత మరొకరు రాజకీయ వేదికలు ప్రకటిస్తున్నారు. కొత్త జెండా.. కొత్త సిద్ధాంతం.. ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. జడ శ్రవణ్ కుమార్, రామచంద్ర యాదవ్, మాజీ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా పలువురు నేతలు రాజకీయంగా తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తన రాజకీయ భవిష్యత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే కొత్త పార్టీలు పెట్టడం వెనుక నిజంగా ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలన్న లక్ష్యమా..? లేక ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడమే అసలు వ్యూహమా..? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Also Read : ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఓటర్ల జాబితాపై కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ రెండు ప్రధాన రాజకీయ శక్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు అధికార కూటమి.. మరోవైపు వైసీపీ. ఈ రెండు ప్రధాన శక్తుల మధ్యే ఎన్నికల పోరు సాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడే పార్టీలు తమకు ప్రత్యేకమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన కేడర్, నియోజకవర్గాల వారీగా నాయకత్వం, ప్రతి బూత్‌లో కార్యకర్తల వ్యవస్థ లేకుండా కొత్త పార్టీలు ఎన్నికల రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపగలవన్నది ప్రశ్నగా మారింది.
రాజకీయ పార్టీని ప్రకటించడం, జెండా ఆవిష్కరించడం, భారీ సభ నిర్వహించడం, మీడియా సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేయడం సులువే. కానీ ఎన్నికల సమయంలో ఓటరును పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం అంత సులభం కాదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కేడర్‌ను నిర్మించడానికి సంవత్సరాల సమయం పడుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలి. కార్యకర్తలను సమన్వయం చేయాలి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భారీ ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. ఇవన్నీ లేకుండా కేవలం సోషల్ మీడియా ప్రచారం, టీవీ చర్చలు, మీడియా ప్రకటనలతో రాజకీయంగా బలవడటం సాధ్యమా అన్నది కొత్త పార్టీలకు ఎదురవుతున్న ప్రధాన నవాలు.
Also Read : తాడేపల్లి ప్యాలెస్‌కు సజ్జల దూరం..? వైసీపి నేతలకు జగన్ కీలక ఆదేశాలు..!
ఇక కొత్త పార్టీల ప్రభావం ప్రధానంగా ఓట్ల చీలికపైనే ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హోరాహోరీ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని వందల లేదా కొన్ని వేల ఓట్లు కూడా గెలుపోటములను మార్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి వచ్చిన ఓట్లు దాని సొంత రాజకీయ బలానికి నిదర్శనం కాకపోయినా.. ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై మాత్రం గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో కొత్త పార్టీలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
సామాజిక వర్గాల పేరుతో రాజకీయ పునాది నిర్మించాలన్న ప్రయత్నాలు కూడా ఏపీలో కొత్తేమీ కాదు. అయితే ఒక సామాజిక వర్గం మొత్తాన్ని ఒకే రాజకీయ పార్టీ వైపు మళ్లించడం అంత సులభం కాదు. ప్రతి సామాజిక వర్గంలో రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. స్థానిక సమస్యలు, అభ్యర్థి వ్యక్తిగత పరిచయం, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరు, కుల సమీకరణాలు, పార్టీ నాయకత్వంపై ఉన్న అభిప్రాయం.. ఇలా అనేక అంశాలు ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఒక వర్గం ఓట్లను తమవైపు తిప్పుకుంటామని ప్రకటించడం వేరు.. ఆ ఓట్లను ఎన్నికల రోజున పోలింగ్ బూత్ వరకు తీసుకురావడం వేరు.
Also Read : ఇది జగన్ వ్యూహమా? రాజకీయ గందరగోళమా?
మాజీ ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి రావడం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. పరిపాలనా అనుభవం, ప్రభుత్వ వ్యవస్థపై అవగాహన వారికి బలంగా ఉండవచ్చు. అయితే ఆ అనుభవాన్ని రాజకీయ ఓట్లుగా మార్చడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. అధికారిగా ఉన్నప్పుడు ప్రజలను కలవడం ఒకటైతే.. రాజకీయ నాయకుడిగా ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి కార్యకర్తతో సంబంధం కొనసాగించడం మరో విషయం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో విశ్వసనీయత సంపాదించాల్సి ఉంటుంది. ప్రజాదరణ ఉన్న నేతలు. సినీ గ్లామర్ ఉన్న నాయకులు, భారీ అభిమాన వర్గాలు ఉన్నప్పటికీ రాజకీయంగా బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవడానికి సంవత్సరాల పాటు శ్రమించాల్సి వచ్చింది. అందువల్ల కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చిన నేతలు తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతామని భావిస్తే అది ఎంతవరకు సాధ్యమన్నది ఎన్నికలే తేల్చనున్నాయి.


