కౌన్ బనేగా బిహార్ సీఎం.. ఇదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న మాట. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి పూర్తిస్థాయి మెజారిటీ సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 202 చోట్ల ఎన్‌డీఏ అభ్యర్థులు గెలిచారు. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలవగా.. నితీశ్ సారధ్యంలోని జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. ఇక మహాగఠ్ బంధన్‌కు గట్టి దెబ్బ తగిలింది. కేవలం 35 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అయితే మరీ 6 సీట్లకే పరిమితమైంది.
Also Read : పెట్టుబడుల్లో ఏపీ దూకుడు.. రికార్డ్ స్థాయిలో ఒప్పందాలు..!
ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పుడు బిహార్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బిహార్ తదుపరి సీఎం ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది. నిజానికి బిహార్‌లో బీజేపీని చూసి ఓటు వేయలేదు. అక్కడ నితీశ్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాల వల్లే ఎన్‌డీఏ కూటమి గెలిచింది. నితీశ్‌కు మహిళలు, బీసీలు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా నివేదికలు ఇచ్చాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం గెలుపు తమ వల్లే వచ్చిందని.. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదం వల్లే ప్రజలు ఓట్లు వేశారంటున్నారు. దీంతో సీఎం కుర్చీ ఎవరిదీ అనే చర్చ నడుస్తోంది.
నితీశ్ సీఎం అవుతారనేది జేడీయూ నేతల మాట. ఇప్పటికే బిహార్‌లో చాలా చోట్ల ఫిర్ ఏక్ బార్.. నితీశ్ సర్కార్ అంటూ జేడీయూ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. టైగర్ అబీ జిందా హై అంటూ చేసిన వ్యాఖ్యలు పాట్నా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలను బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుటే ఏర్పాటు చేయటం పెద్ద దుమారం రేపుతోంది. ఇదే సమయంలో బీజేపీ తరఫున సామ్రాట్ చౌదరి పేరు కూడా సీఎం రేసులో బాగా వినిపిస్తోంది. దీంతో మహారాష్ట్ర తరహాలో బీజేపీ మ్యాజిక్ చేస్తుందనే మాట వినిపిస్తోంది.
243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో 122 సీట్లు మ్యాజిక్ ఫిగర్. నిజానికి ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. అటు బీజేపీ, ఇటు జేడీయూ కూడా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సొంతంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎన్నికల్లో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. పూర్వ మిత్రులు ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, వామపక్షాల 2 సీట్లు కలుపుకున్నా కూడా 118 స్థానాలు మాత్రమే నితిశ్ కూటమికి వస్తాయి. ఇక 89 సీట్లు సాధించిన బీజేపీ సింగిల్‌గా ఏర్పాటు చేయాలనుకుంటే.. ఎల్‌జేపీ 19, హెచ్‌ఏఎమ్‌ఎస్ 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు కలుపుకుంటే 117 స్థానాలు ఉన్నాయి. మరో నాలుగు చిన్నా పార్టీలతో పాటు స్వతంత్రులతో కలిసి మేజిక్ ఫిగర్ చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.
Also Read : రంగంలోకి రవిశంకర్ అయ్యన్నార్.. సతీష్ హత్యలో సంచలన విషయాలు..!
ఈ నేపథ్యంలో 5 స్థానాలు గెలిచిన ఎంఐఎం కీలకంగా మారింది. 118 సీట్లకు ఎంఐఎం 5 జత కలిస్తే.. 123 స్థానాలతో నితీశ్ కూటమికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సీఎం కుర్చీ నితీశకు ఇచ్చేసి.. మంత్రివర్గంలో కీలక శాఖలు, మెజారిటీ వాటా అడిగితే సరిపోతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. అటు నితీశ్ కూడా ఇదే తనకు చివరి ఎన్నికలు అని ముందే ప్రకటించారు. దీంతో సీఎం కుర్చీ జేడీయూ దే అని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

