కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ పాపంలో ఒక్కొక్కరు సైలెంట్ గా వెలుగులోకి వస్తున్నారు. ముందు ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొట్టినట్లు భావించారు. ఆ తర్వాత బస్సు కిందకు ద్విచక్ర వాహనం వెళ్లడంతో డీజిల్ ట్యాంక్ లీక్ అయ్యి మంటలు చెలరేగినట్లు భావించారు. కానీ డ్రైవర్ ను విచారించిన తర్వాత మరో విషయం వెలుగులోకి వచ్చింది. అసలు తాము ద్విచక్ర వాహనాన్ని ఢీకొనలేదని.. అప్పటికే రోడ్డుపై వాహనం పడి ఉందని, ఆ వాహనం సరిగా కనపడలేదని డ్రైవర్ వెల్లడించాడు.
Also Read : ఏపీలో 40 వేల కోట్ల విద్యుత్ కుంభకోణం.. ఏబీవీ సంచలన ఆరోపణలు
ఇక నేడు ఉదయం వెలుగులోకి వచ్చిన వీడియోలు మరో సంచలన విషయాన్ని బయట పెట్టాయి. ఈ ఘటనకు ప్రధాన కారణం ద్విచక్ర వాహనం నడిపిన శివ శంకర్ అనే వ్యక్తి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతను పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత పెట్రోల్ కోసం వెళ్లి.. అక్కడ సిబ్బందిపై కేకలు కూడా వేసినట్లు సీసీ కెమెరా వీడియోల్లో బయటకు వచ్చింది. అతను తప్పతాగి ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. తాగి డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. ఇక బలమైన గాయాలు కావడంతో రోడ్డుపైన అతను ప్రాణాలు కోల్పోయాడు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న ముప్పు
బండి రోడ్డుపై పడి ఉండడంతో బస్సు డ్రైవర్ గుర్తించలేకపోయాడు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక ద్విచక్ర వాహనంపై మరో యువకుడు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సెల్ ఫోన్ నెంబర్లు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రి స్వామి అనే యువకుడు బైక్ పై ఉన్నట్లు తేల్చారు. దీనితో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక బస్సు నడిపిన డ్రైవర్ లక్ష్మయ్యకు అసలు హెవీ లైసెన్స్ పొందే అర్హత లేదని కూడా విచారణలో గుర్తించారు. ఐదవ తరగతి వరకు మాత్రమే చదివిన అతను.. పదవ తరగతి చదివినట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి లైసెన్స్ తీసుకున్నట్లు తేల్చారు.




