దుబాయ్ వేదికగా ఆసియా కప్ ఫైనల్లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తొమ్మిదవ సారి ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత్. ఇక ఈ మ్యాచ్ లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ చేసిన పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతనిపై ఇప్పటివరకు విమర్శలు చేసిన వాళ్లు కూడా కంగుతినేలా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు తిలక్. గుంటూరుకు చెందిన ఈ యువ ఆటగాడు గత ఏడాదికాలంగా టి20 జట్టులో అత్యంత కీలకంగా మారాడు.
Also Read : మీరేం ప్రజా ప్రతినిధులు సార్..?
ముఖ్యంగా టాప్ ఆర్డర్ లో అతను చేస్తున్న పరుగులు టీం విజయాల్లో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నాయి. మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే తిలక్ వరుసగా రెండు సెంచరీలు కూడా బాదాడు. ఇక బంగ్లాదేశ్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ల్లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాడు. తాజాగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో.. తిలక్ వీరోచత పోరాటం చేశాడు. మరో బ్యాట్స్మెన్ సంజు శాంసన్ తో కలిసి భారత ఇన్నింగ్స్ నిర్మించాడు. అయితే 77 పరుగుల వద్ద సంజు అవుట్ అయినా సరే తిలక్ మాత్రం వికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత శివం దూబేతో కలిసి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
Also Read : బీఎస్ఎన్ఎల్ సరికొత్త అడుగు.. భారత్ నూతన అధ్యాయం..!
ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా అతను చేసిన 69 పరుగులు.. చరిత్రలో నిలిచిపోయాయి. ప్రస్తుతం టి20 జట్టులో అతను అత్యంత కీలక ఆటగాడిగా మారడంతో తెలుగు క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒకప్పుడు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ ఆ స్థానాల్లో జట్టుకు విలువైన సేవలు అందించారు. ఇప్పుడు అదే స్థానాల్లో ఆడుతున్న తిలక్ భవిష్యత్తులో మరింత కీలకంగా మారనున్నాడు. అవసరమైన సమయంలో బౌలింగ్ కూడా చేయగలిగే తిలక్.. త్వరలోనే వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకునే సంకేతాలు కనపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా తిలక్ ఎంపికయ్యాడు.