ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మంత్రిత్వ శాఖపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ మంత్రి వంగలపూడి అనిత తీరు కూడా ఇందుకు ప్రధాన కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. హోమ్ శాఖ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ శాఖ తీరుపై వస్తున్న ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటోందనే మాట కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలకు హోమ్ శాఖ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు బలం కలిగిస్తోంది.
Also Read : అక్కడ ఏం జరుగుతోంది..?
ఏపీలో హోమ్ మంత్రిగా వంగలపూడి అనిత వ్యవహరిస్తున్నారు. ఈ శాఖపై తీవ్ర విమర్శలకు హోమ్ మంత్రి కారణమనే మాట కూడా వినిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే.. ఆమె చుట్టూ చేరిన వ్యక్తులు.. పైరవీలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి దంపతులు అనిత కార్యాలయం బయటే ఉంటున్నారని.. ఏ పని కావాలన్నా వీరికి ముడుపులు చెల్లించాలనే ఆరోపణలు ఏడాది క్రితమే వెల్లువెత్తాయి. దీనిపై సోషల్ మీడియాలో ఫోటోలతో సహా వార్తలు రావడంతో.. జయలక్ష్మిని అనిత దూరం పెట్టారనేది పార్టీ నేతల మాట.
ఇక తన వ్యక్తిగత పీఏ జగదీష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జగదీష్‌ను తొలగిస్తున్నట్లు అనిత స్వయంగా ప్రకటించారు. పోలీసుల బదిలీలు మొదలు.. స్టేషన్‌లో సెటిల్మెంట్ వరకు జగదీష్ వేలు పెట్టారనేది ప్రధాన ఆరోపణలు. చివరికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఓ సీనియర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు చివరికి సీఎంఓ వరకు చేరాయి. దీంతో.. తప్పని సరి పరిస్థితుల్లో జగదీష్‌ను తొలగిస్తున్నట్లు అనిత ప్రకటించారు. అయితే ఇప్పటికీ అనితతో జగదీష్ నిరంతరం టచ్‌లో ఉన్నారనేది అత్యంత ఆప్తుల మాట.
Also Read : రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి.. డైరెక్ట్ గా రేవంత్ పేరే వాడుతూ..!
ఈ ఆరోపణల వేడి ఇంకా చల్లారక ముందే.. కంప్యూటర్ల కొనుగోలు కుంభకోణం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కంప్యూటర్ల కోనుగోలులో పెద్ద మొత్తం చేతులు మారిందని.. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో కూడా అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. దీని కారణంగానే అనితను పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా హోమ్ శాఖలో కిలేడి అంటూ టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడం పెద్ద దుమారం రేపింది. ఆ మహిళ వివరాలు ఆంధ్రజ్యోతి గోప్యంగా ఉంచినప్పటికీ.. సదరు మహిళ వివరాలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మహిళ.. ఓ ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
గత ప్రభుత్వంలో దిశా యాప్ ఛైర్మన్‌గా వ్యవహరించిన సదరు మహిళ.. “మీకు ఏం కావాలో చెప్పండి.. నేను చూసుకుంటా.. నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే..” అంటూ డీఎస్పీలు, సీఐ, ఎస్సైలను కమాండ్ చేసే స్థాయికి చేరుకున్నారు. వైసీపీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న మహిళ.. హోమ్ శాఖలో ఆడింది ఆట.. పాడింది పాటగా రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు సైలెంట్‌గా ఉన్న మహిళ.. ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారి సాయంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. తన మార్క్ పని తీరుకు తెరలేపారు. ఈ సారి ఏకంగా సచివాలయానికి మకాం మార్చారు. ఏ పని కావాలన్నా సరే.. ప్లీజ్ కాంటాక్ట్ అంటూ బోర్డు పెట్టారు. జీవిత ఖైదు పడిన ఖైదీకి పెరోల్ ఇప్పించారు. అలాగే నెల్లూరు సెంట్రల్ జైలులోని ఓ ఖైదీ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళతో రాసలీలలు చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : జామ ఆకు టీ.. షుగర్ ను కంట్రోల్ చేస్తుందా..?
ఇంత జరుగుతున్నా కూడా హోమ్ మంత్రి అనిత నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గతంలో ఇదే హోమ్ శాఖపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన అనిత.. ఇప్పుడు అదే హోమ్ శాఖలో అవినీతి జరుగుతుంటే.. ఏం చేస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. సోషల్ మీడియాలో సొంత ప్రచారానికే అనిత ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని.. అసలు హోమ్ మంత్రి ఉన్నారా అని నిలదీస్తున్నారు. దీంతో వంగలపూడి అనితపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




