పార్లమెంట్ సమావేశాల వేదికగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల విషయంలో తనను బెదిరించడానికి ప్రభుత్వం మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని పంపిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే టోకు మార్కెట్లను నియంత్రించకుండా ఉండే మూడు వేర్వేరు చట్టాలతో కూడిన వ్యవసాయ చట్టాలను 2020లో కేంద్రం ప్రవేశ పెట్టింది.
Also Read : ప్రజ్వల్ రేవన్నకు కోర్ట్ బిగ్ షాక్.. పొలిటికల్ కెరీర్ ఖతం..!
ఆ తర్వాత పెద్ద ఎత్తున రైతులు నిరసన చేయడంతో ఏడాది తర్వాత చట్టాలను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ చట్టాల విషయంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో.. అరుణ్ జైట్లీ తన వద్దకు వచ్చి.. నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వచ్చి హెచ్చరించారని.. అప్పుడు జైట్లీని చూసి నవ్వి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో.. నీకు తెలియదు అనుకుంటున్నా అన్నాను అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
Also Read : టార్గెట్ కమ్మ సామాజిక వర్గం.. సోషల్ మీడియాలో కొత్త వ్యూహం..?
అయితే ఈ వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఖండించారు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత నిరసనలు జరిగాయన్నారు. బిజెపి కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. రోహన్ జైట్లీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇప్పుడు వ్యవసాయ చట్టాల విషయంలో తన తండ్రి అరుణ్ జైట్లీ బెదిరించారని చెబుతున్నారని, రాహుల్ గాంధీకి గుర్తు చేస్తాను అంటూ.. తన తండ్రి 2019లో మరణించారని.. వ్యవసాయ చట్టాలు 2020లో ప్రవేశపెట్టారు అన్నారు. అసలు తన తండ్రి ఎవరినీ బెదిరించే వ్యక్తి కాదని, ఆయనది అసలు ఆ స్వభావం కాదన్నారు.