బిగ్ బాస్ అరెస్టు ఖాయమా.. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్.. ఇంతకీ ఎవరా బిగ్ బాస్.. ఎక్కడుంటారు.. ఏం చేస్తుంటారు.. అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ బిగ్ బాస్‌ను అరెస్టు చేయడానికి కారణం ఏమిటీ.. ఏ కేసులో బిగ్ బాస్ అరెస్టు అవుతారనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో.. అటు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్న ప్రశ్నలు. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా మొత్తం 11 మంది అరెస్టు అయ్యారు. మిథున్ అరెస్టు తర్వాత అంతా కింగ్ పిన్ అరెస్టు ఖాయమనే భావించారు కూడా. ఇక ఆ తర్వాత కేసులో ఏ 40 వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో జరిపిన సోదాల్లో 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీజీపీతో సీఐడీ డీజీ భేటీ అవ్వడంతో కీలక నేత అరెస్టు ఖాయమనుకున్నారు కూడా.
Also Read : టార్గెట్ కమ్మ సామాజిక వర్గం.. సోషల్ మీడియాలో కొత్త వ్యూహం..?
లిక్కర్ కేసులో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. ఎలాంటి డిస్టిలరీ లేని సంస్థలకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. నాసిరకం మద్యం విక్రయించారు. ఎక్కడా దొరకని పిచ్చి మందు ప్రజలకు అమ్మారనే ఆరోపణలున్నాయి. ఇక ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతుంటే.. ఏపీలో మాత్రం కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయించారు. అధిక ధరకు నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారనేది ప్రధాన ఆరోపణ. చివరికి హైకోర్టు ఆదేశించినా సరే.. వైన్ షాపులలో కేవలం నగదు చెల్లింపులు మాత్రమే నిర్వహించారు తప్ప.. ఎక్కడా ఆన్ లైన్ చెల్లింపులకు అనుమతివ్వలేదు. మద్యం స్కామ్‌లో దేశంలోనే అతి పెద్దదని.. ఢిల్లీ, రాజస్థాన్ లిక్కర్ స్కామ్‌ల కంటే.. ఏపీ స్కామ్ చాలా పెద్దదని ఏకంగా పార్లమెంట్‌లోనే టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.
Also Read : ఇండియాకు ఆయిల్ ఎగుమతి చేసే దమ్ము పాక్ కు ఉందా..? లెక్కలు ఇవే..!
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అరెస్టు ఖాయమని ముందుగా బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నుంచి నేతలంతా ఒక్కొక్కరుగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తప్పు చేసిన వారు ఏ స్థాయి వాళ్లైనా శిక్ష అనుభవించాల్సిందే అంటూ సీఎం చంద్రబాబు కూడా అన్నారు. ఇక హోమ్ మంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర.. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో జగన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసిన వాళ్లే. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా జగన్ అరెస్టు ఖాయమని జోస్యం చెప్పారు. తాజాగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా త్వరలో బిగ్ బాస్ అరెస్టు అంటూ వ్యాఖ్యానించడం మరో 2 వారాల్లో జగన్‌ను పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. లిక్కర్ స్కామ్‌లో నేరుగా జగన్ పేరు ప్రస్తావించకుండా.. ఇలా కింగ్ పిన్, బిగ్ బాస్ అంటూ వ్యవహరిస్తున్నారనేది ప్రభుత్వ పెద్దల మాట.