తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయాణంపై ఎన్నో ఊహాగానాలు. దాదాపు ఆరు నెలల నుంచి.. పార్టీలో చేరబోయే నాయకులు, జిల్లా, మండల, రాష్ట్ర అధ్యక్ష పదవులు, నియోజకవర్గాల ఇంచార్జ్ పదవులు ఇలా ఏదోక చర్చ జరుగుతూనే ఉంది. ఏపీలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ఫార్ములాను తెలంగాణాలో సైతం అమలు చేసే దిశగా ఎన్డియే అడుగులు వేస్తోంది అంటూ కథనాలు వచ్చాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్, స్థానిక సంస్థలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ ఇలా చాలా ప్రచారాలు జరిగాయి.
Also Read : టీసీఎస్ నిర్ణయం వెనుక కారణం అదేనా..?
ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉప ఎన్నికపైనే టీడీపీ ఫోకస్ చేసిందని, కొన్ని కారణాలతో బిజేపి పక్కకు తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి వాసిరెడ్డి రామనాథం కీలక ప్రకటన చేసారు. రాబోయే తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీలో ఉంటుందన్నారు. మధిరలో మాట్లాడిన ఆయన.. తెలంగాణాలో టీడీపీ ఇంకా బలంగానే ఉందని, గెలుపోటములపై ప్రభావం చూపించే స్థితిలో ఉందని వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో పోటీలో నిలుస్తుంది అన్నారు.
Also Read : దేశాధినేతను లేపేస్తాం.. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ద మేఘాలు
అవసరమైతే ఇతర పార్టీలతో పోత్తులకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ కీలక పాత్ర పోషించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా చూస్తే తెలంగాణాలో టీడీపీ స్థానిక సంస్థల్లో పోటీ చేసి, ఫలితాల ఆధారంగా నియోజకవర్గాల ఇంచార్జ్ లను నియమించే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ లో బిజేపితో కలిసి వెళ్లి.. అక్కడ ఫలితాల ఆధారంగా కూడా ఇంచార్జ్ లను నియమించే సూచనలు కనపడుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ నాయకులను కూడా చేర్చుకునే అవకాశాలు స్థానిక సంస్థల తర్వాతనే ఉండవచ్చు అని తెలుస్తోంది.