అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ఓడిన తర్వాత మరోలా వ్యవహరించడం వైసీపీకి పరిపాటి. పాదయాత్ర చేసేటప్పుడు మీరే నా దేవుళ్లు అన్నారు జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాత.. గేటు బయటే నిలబెట్టారు. పరదాల మాటున తిరిగారు. ఇంకా చెప్పాలంటే.. ఎన్నికల్లో గెలవాలంటే.. జస్ట్ డబ్బులిస్తే సరిపోతుందని భావించిన జగన్.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియాను బాగా వినియోగించారు. ఇక అధికారంలోకి వచ్చేందుకు.. ఉన్న ఐదేళ్లు కూడా తన సొంత ఆలోచన కంటే కూడా.. ఐ ప్యాక్ టీమ్ చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ సారధ్యంలోని ఐ ప్యాక్‌తో జగన్ ఒప్పందం చేసుకున్నారు. వాళ్లు చెప్పినట్లు చేశారు. సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం చేశారు.
Also Read : ఆ కేసుల పరిస్థితి ఏమిటీ..?
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్‌కు గుడ్ బై చెప్పేశారు. అయితే వైసీపీ మాత్రం.. ఐ ప్యాక్‌తో తన ప్రయాణం కొనసాగించింది. ఏడాదికి వంద కోట్ల వరకు ఐ ప్యాక్‌కు చెల్లించినట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి కూడా. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియా ముందు కూడా ఐ ప్యాక్ చెప్పిందే వేదం అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరించారు. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వెళ్లిన సమయంలో నాటి మంత్రి ఆదిమూలపు సురేష్ హంగామా చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామంటూ నడిరోడ్డు మీద చొక్కా విప్పేశారు. ఇదంతా కూడా ఐ ప్యాక్ టీమ్ డైరెక్షన్‌లోనే జరిగింది. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రతిపక్షాలపై అప్పట్లో వైసీపీ నేతలు, కార్యకర్తలపై చేసిన దాడి మామూలుగా లేదు. మార్ఫింగ్ ఫోటోలు, బూతు కామెంట్లతో రెచ్చిపోయారు. ఇదంతా ఐ ప్యాక్ డైరెక్షన్‌లోనే జరిగిందని అప్పట్లోనే వైసీపీ నేతలు విమర్శలు చేశారు. చివరికి మీడియా ముందు, ఎన్నికల్లో ఏం మాట్లాడాలో కూడా ఐ ప్యాస్ టీమ్ చెప్పేసింది. అందుకే పోలింగ్ ముగిసిన వెంటనే.. జగన్ నేరుగా విజయవాడలోని ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లారు. మీరంతా ఎంతో కష్టపడ్డారు.. మీ వల్లే మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. మీ సేవలకు సరైన గుర్తింపు వస్తుందన్నారు జగన్.
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స అయ్యింది. వైసీపీ ఘోరంగా ఓడింది. దీంతో ఐ ప్యాక్ టీమ్‌కు మంగళం పాడింది. వైసీపీ కోసం తీసుకున్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఓ గదిలో ప్రస్తుతం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఐ ప్యాక్ టీమ్ అని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. దీనిపై అధినేతకు నేరుగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం రాలేదు. దీంతో కిందిస్థాయి నేతలకు ఇదే విషయం వెల్లడించారు. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై వైసీపీ నేతలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏ చిన్న అవకాశం దొరికినా సరే.. దానిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వంపై పదే పదే బురద జల్లడం.. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : కర్నూలులో ఇండియన్ ఆర్మీ సంచలన ప్రయోగం..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనేది వైసీపీ నేతల ప్లాన్. లోకల్ బాడీ ఎన్నికల్లో ఓడితే.. వైసీపీ పైన ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకుల మాట. కూటమి గెలుపు ఈవీఎం స్కామ్ అని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే బ్యాలెట్ విధానంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడింది. దీనిపై మాత్రం ఆ పార్టీ నేతలు నోరెత్తడం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. పోటీ చేసి ఓడిపోతే పరువు దక్కుతుందనేది ఆ పార్టీ నేతల మాట. అందుకే లోకల్ బాడీ ఎన్నికల కోసం వైసీపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. వైసీపీ తన కార్యాచరణలో కూడా కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాజకీయ వ్యూహకర్తలు, ఏజెన్సీలపై ఆధారపడటం వల్లే 2024 ఎన్నికల్లో ఓడినట్లు సజ్జల వెల్లడించారు. ఇక పైన ఎలాంటి ఏజెన్సీలతో వైసీపీ ఒప్పందం చేసుకోదని స్పష్టం చేశారు. పార్టీకి బలమైన క్యాడర్ ఉందని.. సొంతంగా పార్టీని నిర్మించుకునేందుకు ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లు తెలిపారు.
Also Read : 2 వారాలుగా జగన్ ఫుల్ బిజీ.. ఏం జరుగుతోంది..?
పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని.. ఇందుకు సొంత కార్యకర్తల పైనే ఆధారపడతామన్నారు. బయట ఏజెన్సీలు తమను మోసం చేశాయని పరోక్షంగా ఆరోపించారు. పార్టీ అధినేత సూచనలు నేరుగా కార్యకర్తలకు చేరేలా వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు సజ్జల. పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో నిర్మిస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో కేవలం సంక్షేమ పథకాల అమలు, పరిపాలనపైనే దృష్టి పెట్టామన్నారు సజ్జల పార్టీ సంస్థాగత నిర్మాణంపైన, కార్యకర్త సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు. కేవలం బయట సంస్థలపై ఆధారపడటం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. అందుకే ఈసారి ఇలా బయట ఏజెన్సీలను నమ్మేది లేదని సజ్జల తెగేసి చెప్పేశారు. కేవలం పార్టీ కార్యకర్తలపైనే నమ్మకం పెట్టుకున్నామనేది సజ్జల మాట.