అధినేత అంటే.. అందరికీ మంచి చేసే వాడు అంటారు. రాజు స్థానంలో ఉన్న వ్యక్తి తన ప్రజల బాగోగులు చూస్తారు కూడా. తన కోసం పని చేసిన వారిని గౌరవంగా చూడటమే అధినాయకుని ప్రధమ కర్తవ్యం. అందుకే ప్రతి ఒక్కరు అధినేతకు విధేయులుగా ఉంటారు. కానీ ఇవన్నీ చంద్రబాబు విషయంలో ఏ మాత్రం వర్కవుట్ కావటం లేదు. అందుకే కార్యకర్తలంతా పార్టీ అధినేతపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఇందుకేనా మేము పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేసిందని నిలదీస్తున్నారు కూడా. అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని మాట ఇస్తారు తప్ప.. అది నిలబెట్టుకునే విషయంలో మాత్రం చంద్రబాబు కాస్త అశ్రద్ధ చూపిస్తారనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. ఇలాంటి హామీలు తీసుకున్న నేతలు, కార్యకర్తలంతా ఏడాది కాలంగా వాటి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు తప్ప.. వాళ్ల కల మాత్రం నెరవేరటం లేదు.
Also Read : ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి కేసు.. ఏం చేసుకుంటావో చేసుకోమన్న ప్రసన్న..!
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడిన నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కొంత మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కొందరిపై దాడులు జరిగాయి. కొందరైతే ప్రాణభయంతో సొంత ఊళ్లు వదిలేసి ఎక్కడో తలదాచుకున్నారు. ఇక కొందరైతే తప్పుడు కేసుల కారణంగా రోజులు, నెలల తరబడి జైళ్లల్లో ఉన్నారు. ఇలాంటి వారికి ఎన్నికలకు ముందు చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు మాట. ఎన్నికల్లో పార్టీ గెలిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటింది. అయినా సరే చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదు. పైగా నేతలు, కార్యకర్తలు ఇప్పటికీ పాట్లు పడుతూనే ఉన్నారు.
Also Read : బావా, బామ్మర్దులుగా బాలయ్య, వెంకటేష్..!
వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసుల కారణంగా కొంతమంది నేతలు, కార్యకర్తలు నెలల తరబడి జైళ్లల్లో ఉన్నారు. అలాంటి వారంతా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ గెలుపు కోసం ఎన్నికల్లో పని చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులన్నీ మాఫీ చేస్తామని యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి నారా లోకేష్ హామీ కూడా ఇచ్చారు. కానీ ఏడాది దాటినా కూడా ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. నాడు జైళ్లకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. ఇప్పటికీ కోర్టు వాయిదాలకు వెళ్తూనే ఉన్నారు. ప్రభుత్వం మారినా కూడా తమకేంటి ఈ అవస్థ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు నేతలు. తమ మీద పెట్టినవి తప్పుడు కేసులని అప్పట్లోనే చంద్రబాబు, లోకేష్ సహా ముఖ్యనేతలంతా వ్యాఖ్యానించారని.. మరి అలాంటి కేసును తొలగించడానికి ఇన్ని రోజులు ఎందుకనీ నిలదీస్తున్నారు.
Also Read : శంకర్ కు సాధ్యంకాని విజయం శేఖర్ కు ఎలా సాధ్యమైంది?
పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఇస్తామన్నారు లోకేష్. కానీ ఏడాది దాటినా కూడా ఆ హామీ కూడా అమలు కాలేదు. ఏడాది కాలంగా కనీసం ఆలయ కమిటీలను ప్రకటించటం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తప్ప.. మరే ఆలయానికి కూడా పాలకమండలిని నియమించలేదు. శ్రీశైలం, దుర్గ గుడి, అన్నవరం, సింహాచలం, కాణిపాకం, అరసవల్లి, ద్వారకా తిరుమల వంటి ప్రముఖ ఆలయాలు కూడా పాలక మండలిలేక అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఒక కమిటీ నియమించడానికి ఏడాది సమయమా అని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ చాలా బెటర్ అని కూడా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అయిన వారికి పదవులిచ్చేశారని.. అందుకే వారిని కార్యకరర్తలు నెత్తిన పెట్టుకుంటున్నారంటున్నారు. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు మారకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.