రాఘవ లారెన్స్… నటుడు, కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశారు.. చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో బాల నటుడిగా నటించిన రవిరాజ్ రాథోడ్ ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు.
Also Read : తిరుపతిలో భయపెడుతున్న గంజాయి గ్యాంగ్ లు..
తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించాడు. ఇందుకోసం పెద్ద మొత్తంలోనే ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన మంచి కోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్.. చెప్పాపెట్టకుండా స్కూల్ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.
లారెన్స్ ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ ను వీడియోలో చూసి లారెన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది.. మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిసి స్కూల్లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు స్కూల్ మానేసినట్లు తెలిసింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.
Also Read : టీం ఇండియా అండర్ రేటెడ్ క్రికెటర్
ఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్ (ట్విటర్ ) లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ ను పొందుపరిచాడు. రాఘవ లారెన్స్.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్, అధిగరం, కాల భైరవ, బుల్లెట్, హంటర్ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు.