మధ్య తరగతి ప్రజలకు వరుసగా ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇటీవల హోం లోన్ సహా పలు రుణాల ఈఎంఐలను తగ్గించే దిశగా అడుగులు వేసింది రిజర్వ్ బ్యాంక్. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. జీఎస్టీ తగ్గించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని జాతీయ మీడియా వెల్లడించింది. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించడం లేదా ప్రస్తుతం 12 శాతం పన్ను విధిస్తున్న అనేక వస్తువుల కేటగిరిలోకి తీసుకురావాలని భావిస్తోంది. 5 శాతం జీఎస్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు జాతీయ మీడియా తెలిపింది.
Also Read : రష్యా స్నేహం ఇండియాను ముంచుతుందా..? ట్రంప్ సంచలన బిల్..!
మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు విస్తృతంగా ఉపయోగించే టూత్‌పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు, వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ లు, గీజర్‌లు, వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ.1,000 కంటే ఎక్కువ ధర గల రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుండి రూ.1,000 మధ్య ధర గల పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్ మరియు వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ధరలు తగ్గించేందుకు సిద్దమవుతోంది.
Also Read : రెండో టెస్టులో భారత జట్టులో జరిగే మార్పులు ఇవే
అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేసిన వంట సామాగ్రి మరియు పాత్రల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై రూ.40,000 కోట్ల నుండి రూ.50,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినప్పటికీ, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు గత కొంత కాలంగా. జీఎస్టీ కౌన్సిల్ ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల చివర్లో జరిగే 56వ జీఎస్టీ సమావేశంలో ఇది ప్రతిపాదనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.