రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి మే నెల 9వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 22న ప్రకటన జారీ చేస్తారు. అలాగే ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 2వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. మే 9వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడిస్తారు. వాస్తవానికి 2028 జూన్ 21వ తేదీ వరకు విజయసాయిరెడ్డికి అవకాశం ఉంది. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఈ ఏడాది జనవరి 25న తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
Also Read :వైసీపీ ఎమ్మెల్సీకి శిక్ష ఖాయమా..?
ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అందరి దృష్టి విజయసాయిరెడ్డి వైపు మళ్లింది. సాయిరెడ్డి బీజేపీలో చేరుతారని.. ఆ వెంటనే సాయిరెడ్డికి బీజేపీ ఎంపీగా అవకాశం వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత బీజేపీ చేరేందుకు సాయిరెడ్డి ప్రయత్నాలు చేశారనే మాట వినిపించింది. కానీ కూటమి పార్టీల ఆమోదం లభించిన తర్వాతే బీజేపీలోకి ఎంట్రీ ఉంటుందని కమలం పార్టీ పెద్దలు స్పష్టం చేయడంతో.. సాయిరెడ్డి చేరికకు బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే నాటి నుంచి టీడీపీ, జనసేన నేతలను ప్రసన్నం చేసుకునేందుకు సాయిరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌పై పదే పదే విమర్శలు చేస్తూ.. వైసీపీని ఇరుకున పెడుతున్నారు సాయిరెడ్డి.
Also Read :రోజాకు అండగా కూటమి మంత్రి
అయితే ప్రస్తుతానికి సాయిరెడ్డి చేరికకు కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలియటం లేదు. దీంతో బీజేపీ పెద్దలు కూడా విజయసాయిరెడ్డి విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనే విషయంపై కూటమి పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీటు కోసం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మరో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అధినేత చంద్రబాబు మాత్రం.. వీరిద్దరికి నో అని ఆన్సర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా పోటీ చేసి ఓడారు వంగవీటి రాధా. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నందున రాధాకు అవకాశం ఇస్తే.. ఇరు పార్టీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రావనేది చంద్రబాబు ప్లాన్. అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే మాట కూడా వినిపిస్తోంది. మరి కూటమి తరఫున ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే ఈ నెల 29 వరకు ఆగాల్సిందే.




