వైసీపీ నేతలు ఒక్కొక్కరికి మంచే జరుగుతోంది. ఎంత పెద్ద అవినీతి ఆరోపణలు వచ్చినా సరే.. వాళ్లు మాత్రం సేఫ్‌గా బయటే తిరుగుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే జైలు జీవితం గడుపుతున్నారు తప్ప.. మిగిలిన వారంతా బయటే ఉన్నారు. ఇందుకు ప్రధానంగా ఏపీ సర్కార్ తరఫున అవినీతి ఆరోపణలను రుజువు చేయడంలో న్యాయవాదులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేస్తారనే అనుమానంతో సుప్రీం కోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read : విడదల రజనీ జైలుకే.. కోర్ట్ ముందు సాక్ష్యాలు
మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో హైకోర్టులో మిథున్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకలు జరిగాయని.. ఇందులో పెద్దిరెడ్డి ప్రమేయం ఉందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తన అరెస్టు ఖాయమని భయపడిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి… హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో అంతా మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని భావించారు. అయితే ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
Also Read : కాకాని పారిపోయారా..? కాపాడుతున్నారా..?
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబం కీలకంగా వ్యవహరించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ టూ స్థానంలో చక్రం తిప్పగా… ఎంపీ మిథున్ రెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించారు జగన్. ఈ ఇద్దరి కనుసన్నల్లోనే పార్టీతో పాటు ప్రభుత్వంలోని కొన్ని విభాగాలు నడిచాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మిథున్ రెడ్డి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ సర్కార్ నడుచుకోవాల్సి ఉంది.