గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గుంటూరు కార్పొరేషన్‌లో ఓ రెవెన్యూ అధికారి భారీ కుంభకోణానికి తెరలేపినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. షాపుల కేటాయింపు సహా పలు లీజు వ్యవహారాల్లో సదరు అధికారి అవినీతికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం, 25 ఏళ్ల లీజు గడువు ముగిసిన షాపులు మళ్లీ వేలం ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నా సరే… వేలం జరపకుండా, కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : సీసీ కెమెరాల చోరీ.. వాళ్లే దొంగలా..?
పది లక్షల రూపాయల లంచం తీసుకుని షాపులను ఇచ్చేస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక రాజకీయ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. లీజు ముగిసిన షాపులను సబ్-లీజుగా ఇతరులకు అప్పగించే విధంగా అక్రమ లావాదేవీలు జరిపినట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఈ వ్యవహారానికి ఓ ప్రముఖ ప్రజా ప్రతినిధి తండ్రి ప్రమేయం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ అక్రమ చర్యల వల్ల కార్పొరేషన్‌కు భారీగా ఆదాయ నష్టం జరుగుతోందని ఉద్యోగులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!
వేలం ప్రక్రియ ద్వారా ఆర్జించాల్సిన నిధులు, అధికారుల అవినీతికి బలవుతున్నాయని.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఆశ్రయం ఇవన్నీ కలిసిపోతూ, కార్పొరేషన్ ఆదాయాన్ని దోచుకుంటున్నారు అని ఉద్యోగులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ రచ్చ ఇప్పటికి సైతం కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇప్పటికే కొందరు అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు దీనిపై ఓ నివేదిక సిద్దం చేయడంతో పాటుగా సాక్ష్యాలను సేకరించినట్టు సమాచారం.