ఏపీలో క్రీడాభివృద్ధిపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌కు అప్పగించింది. ఏసీఏ ఛైర్మన్‌గా ఎన్నికైన కేశినేని చిన్ని… ముందుగా ఏసీఏను ప్రక్షాళన చేశారు. క్రికెట్ సంఘాల్లో రాజకీయాలకు తావు లేదని తేల్చి చెప్పారు. ఏపీలో స్టేడియంల దుస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఐదేళ్ల పాటు ఏసీఏ ఛైర్మన్‌గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి కనీసం స్డేడియంలో పిచ్చి గడ్డి కూడా పీకించలేదని విమర్శించారు. మంగళగిరి సమీపంలో బీసీసీఐ నిర్మిస్తున్న స్టేడియం పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. వీటికి నిధులు రాబట్టడంలో నాటి వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. దీంతో మంగళగిరి స్టేడియం చుట్టూ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చెన్నై..
స్టేడియం పరిసరాలు గంజాయి బ్యాచ్, మందుబాబులు, బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా మారిపోయింది. పరిసరాల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు కూడా. చైర్మన్‌గా చిన్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా క్రికెట్ సంఘాలను నియమించారు. తర్వాత క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే మంగళగిరి స్డేడియం, విశాఖ స్టేడియం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని బీసీసీఐ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. శివనాథ్ కృషితోనే విశాఖలోని ఏసీఏ -వీడీసీఏ స్టేడియంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ స్టేడియంను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కేటాయించారు. ఐపీఎల్ టోర్నీలో రెండు మ్యాచ్‌లకు విశాఖ వేదికగా ఎంపికైంది. ఇదే సమయంలో మరో కీలక విషయాన్ని వెల్లడించారు కేశినేని చిన్ని.
Also Read: సుశాంత్ మరణం మిస్టరీనే…?
రాజధాని అమరావతిలో అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ఐసీసీ అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం మొత్తం 60 ఎకరాలు కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వానికి ఏసీఏ లేఖ కూడా రాసింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కార్ స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అనుమతించింది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్టేడియం నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తి చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే.. నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ అంతర్జాతీయ స్టేడియం దేశంలోనే అతిపెద్ద స్టేడియం. ఇది లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే అమరావతిలో నిర్మించే స్టేడియంలో లక్షా 32 వేల సీటింగ్ సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?
అమరావతిలో మొత్తం 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండేలా ప్లాన్ చేశారు. అందులోనే ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు సమీపంలో ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అలాగే అమరావతిలో కూడా సకల సౌకర్యాలతో అత్యాధునిక స్టార్ హోటల్ నిర్మించేందుకు పలు ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇక అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దీంతో క్రీడాకారులకు వసతి, రవాణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుందని ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో విశాఖ క్రికెట్ స్టేడియంలో మహిళల ప్రపంచకప్ టోర్నీ తొలి మ్యాచ్ నిర్వహించేందుకు కూడా ఐసీసీ ఓకే చెప్పింది. ప్రారంభోత్సవ వేడుకలు కూడా ఇదే స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక ప్రతి ఏటా 30 మైదానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కూడా కేశినేని చిన్ని వెల్లడించారు.