రైల్వే శాఖలో జోన్‌ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పట్లో తీరేలా లేదు. వాస్తవానికి రైల్వే శాఖలో అత్యధిక ఆదాయం వచ్చే జోన్‌లలో దక్షిమ మధ్య రైల్వే జోన్ ఒకటి. సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పనితీరుపై రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా కితాబిచ్చారు. రైళ్ల సమయ పాలనలో దక్షిణ మధ్య రైల్వే జోన్ దాదాపు 97 శాతం మార్కులు సాధించినట్లు ఇటీవల వెల్లడించారు. ఇక రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. అటు ఆదాయంలో, ఇటు పనితీరులో కూడా దక్షిణ మధ్య రైల్వేకు మంచి మార్కులే వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇతర జోన్‌లకు మింగుడు పడని అంశం. అందుకే దక్షిణ మధ్య రైల్వే జోన్ అడిగిన ప్రతి విషయాన్ని కూడా కాదు… కుదరదు అని జవాబిస్తున్నారు ఇతర జోన్ అధికారులు.
Also Read : మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ
విజయవాడ నుంచి అటు బెంగళూరు, మైసూరు నగరాలకు నిత్యం వేల మంది ప్రయాణం చేస్తుంటారు. గతంలో ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగానే బెంగళూరు రాకపోకలు సాగించేవి. ఈ మార్గంలో సుమారు 14 గంటల వరకు ప్రయాణ సమయం. అలాగే రద్దీ కూడా ఎక్కువ. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గం గుంటూరు, మార్కాపురం, నంద్యాల, అనంతపురం, హిందూపురం మీదుగా మచిలీపట్నం – యశ్వంతపూర్ – మచిలీపట్నం 17211/12 కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిస్తోంది రైల్వే శాఖ. ఈ రైలును ముందు ట్రైల్ రన్ కింద వారానికి 3 రోజుల పాటు మాత్రమే నడిపించారు. ఈ రైలుకు ఆదరణ పెరగడంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు వస్తోంది. అలాగే ఈ రైలును మైసూరు వరకు పొడిగించాలనే విజ్ఞప్తులు కూడా వెల్లువెత్తాయి. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు కూడా ప్రతిపాదన చేశారు. కానీ నైరుతీ రైల్వే అధికారులు మాత్రం.. ఈ ప్రతిపాదన తిరస్కరించారు. కొండవీడు ఫ్రీక్వెన్సీ పెంపు ప్రతిపాదనను సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తిరస్కరించారు. కార్యాచరణ పరిమితుల దృష్ట్యా అంటూ ఓ కుంటి సాకు చెప్పారు. వాస్తవానికి ఉదయం 9 గంటలకే యలహంక రైల్వే స్టేషన్ చేరుకుంటున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు.. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో మైసూరు వెళ్లి రావచ్చు కూడా. కానీ అధికారులు ఈ ప్రతిపాదనకు నో చెప్పేశారు.
Also Read : హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ
ఇక గుంటూరు నుంచి మార్కాపురం, నంద్యాల, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి ప్రతి రోజు 17261/62 రైలు రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలు పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప జిల్లాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంది. నిత్యం రద్దీగానే రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలును తిరువణ్ణామలై వరకు పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావించారు. ఈ ప్రాంతల నుంచి అరుణాచలం వెళ్లే భక్తులు తిరుపతి నుంచి మళ్లీ రైలు లేదా బస్సు మారాల్సి వస్తుంది. దీంతో ఈ రైలును తిరుచిరాపల్లి వరకు పొడిగించాలని ద.మ. రైల్వే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రైలు వల్ల ఏపీ నుంచి విల్లుపురం గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కాణిపాకం వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని కూడా సూచించారు. అయితే దక్షిణ రైల్వే అధికారులు మాత్రం ద.మ.రైల్వే అధికారుల ప్రతిపాదనకు మోకాలు అడ్డారు. దీనికి కూడా నైరుతీ రైల్వే అధికారులు చెప్పినట్లుగానే కార్యాచరణ పరిమితులనే సాకుగా చెప్పారు. వాస్తవానికి సాయంత్రం 4.30 గంటలకు గుంటూరులో బయలుదేరే రైలు… ఉదయం 4 గంటలకు తిరుపతి చేరుతుంది. మళ్లీ తిరిగి రాత్రి 7.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. ఉదయం 7.30 గంటలకు గుంటూరు చేరుతుంది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7.25 గంటల వరకు దాదాపు 15 గంటలు తిరుపతిలోనే రైలు నిలిచిపోతుంది. దీని వల్ల ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కూడా ఒత్తిడి చూపిస్తుంది. అదే రైలును పొడిగిస్తే.. ప్రయాణీకులకు సౌకర్యం, రైల్వే శాఖకు ఆదాయం వస్తుంది. కానీ ఈ రెండు రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉండటం వల్ల.. వాటిపై వచ్చే ఆదాయం మొత్తం ఆయా జోన్‌లకే చేరుతుంది. అందుకే ఈ రెండు రైళ్ల పొడిగింపునకు అటు నైరుతీ జోన్, ఇటు దక్షిణ రైల్వే జోన్ అధికారులు నో చెబుతున్నారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టి ఈ రెండు రైళ్లు పొడిగించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ వాసులు కోరుతున్నారు.