పార్టీ అధికారంలో ఉందంటే… పదవుల కోసం ప్రతి ఒక్కరు ఆరాటపడతారు. అలాగే ప్రతి నేత కూడా తమతమ ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. ఇక తాజాగా కొంతమంది సీనియర్ నేతలైతే… ఏ పార్టీ అధికారంలో ఉంటే… ఆ పార్టీలో మారిపోవడం.. పదవులు అనుభవించడం పరిపాటిగా మారింది. ఇక సాధారణంగా విధేయులకే ఎక్కువగా పదవులు వస్తాయి కూడా. నాయకులను మెచ్చుకునే వారికి, నాయకులపై పొగడ్తల వర్షం కురిపించే వారికే పదవులు వస్తాయనేది కూడా బహిరంగ రహస్యం. ఇతర పార్టీల కంటే… కాంగ్రెస్ పార్టీలో అయితే మొదటి నుంచి ఇదే రూల్ అమలవుతోంది. నచ్చిన నాయకుడికి వీరతాళ్లు వేయడంతో… కొన్నిసార్లు సీనియర్లు బహిరంగంగానే పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు.
Also Read : ఇంత జరుగుతున్నా తండ్రి కొడుకులు ఎక్కడా…?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏడాదిన్నర పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో అటు పీసీసీతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. సుమారు 200కు పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఎవరెవరికి పదవులనే విషయం ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫైల్ ఇంకా సీఎంఓకు చేరలేదనేది పార్టీలో వినిపిస్తోంది. అయితే తాజాగా పార్టీ ఇంఛార్జ్ మారడంతో… విషయం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో పదవులు తమకే అని భావించిన వారంతా నిరాశపడుతున్నారు. దీంతో.. నేతలంతా మళ్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు.
Also Read : ఏపీ రాజకీయాలపై ఓ డైరెక్టర్ సెన్సేషనల్ స్టెప్
తెలంగాణలో తాజాగా పీసీసీతో పాటు నామినేటెడ్ పదవుల కేటాయింపు మళ్లీ మొదలైంది. పని చేసే నాయకులకు మాత్రమే పదవులుంటాయని ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే తెలిపారు. దీంతో క్షేత్రస్థాయి నాయకులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని మీనాక్షి తేల్చి చెప్పేశారు. వాస్తవానికి చాలా ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులకు సరైన గుర్తింపు రావడం లేదనే విమర్శలు ఇప్పటికే హస్తం పార్టీ పెద్దలను ఇరుకున పెడుతున్నాయి. ఇప్పుడు అలాంటి వారికి అవకాశం వచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది. టార్గెట్ 2028 ఎలక్షన్ అన్నట్లుగా మీనాక్షి నటరాజన్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయాలు.. పార్టీలోని కొందరు సీనియర్లను ఇరుకున పెట్టేలా ఉన్నాయనే మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా సరే… పార్టీ గెలుపే లక్ష్యంగా నటరాజన్ వేస్తున్న అడుగులు లక్ష్యం చేరుతాయో లేదో చూడాలి.