ఏపీ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పక్కదారి పట్టేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక కొందరు నేతలు అయితే రాజకీయాలకు గుడ్ బై కూడా చెప్పేశారు. మిగిలిన వారిలో చాలా మంది దాదాపు 8 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వీరిలో చాలా మంది మాత్రం… సైలెంట్‌గా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి వారిలో ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు సార్లు పోటీ చేసిన సతీష్ కుమార్.. 2009, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన సతీష్… 2014 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ చేరి 2019లో రెండోసారి పోటీ చేసి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
Also Read : ఏపిలో డయల్ యువర్ సీఎం.. ఎవరికి.. ఎందుకు?
అయితే మారుతున్న రాజకీయ పరిణామాలను అంచనా వేసుకుంటున్న సతీష్ కుమార్… భవిష్యత్తులో పార్టీతో పాటు రాష్ట్రాన్ని కూడా మార్చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముమ్మడివరం పక్కనే ఉన్న పుదుచ్చేరి రాష్ట్రం యానాం అసెంబ్లీ నియోజకవర్గంపై సతీష్ కుమార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో యానాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇది పేరుకే పుదుచ్చేరి రాష్ట్రం అయినప్పటికీ.. ఇక్కడ ఉండే వాళ్లంతా ఎక్కువ శాతం తెలుగు వారే. ఇక్కడ వ్యాపార లావాదేవీలు కూడా తెలుగు వారితోనే జరుగుతున్నాయి. దీంతో పొన్నాడ సతీష్ కూడా యానాం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : సభలో 11 నిమిషాలు… చివరికి బాయ్‌కాట్..!
యానాం నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు హవా కొనసాగుతుందనేది వాస్తవం. 1996లో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి గెలిచిన మల్లాది… ఆ తర్వాత 2000లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడారు. కానీ ఆ మరుసటి ఏడాది 2001లో రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లాది కృష్ణారావు.. 2006, 2011, 2016 వరుస గెలుపులతో డబుల్ హ్యాట్రిక్ సాధించారు కూడా. కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మల్లాది… దాదాపు 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించారు కూడా. ఆయతే వయోభారంతో 2021 ఎన్నికల నుంచి మల్లాది తప్పుకున్నప్పటికీ… ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్‌కు మద్దతు తెలిపారు. దీంతో యానాం ప్రజలు గొల్లపల్లి శ్రీనివాస అశోక్‌ను ఎన్నుకున్నారు. దీంతో మరోసారి మల్లాది మాటను యానాం ప్రజలు వింటారని రుజువైంది.
Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!
ఇక రాబోయే యానాం అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న పొన్నాడ సతీష్ కుమార్… ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. వివిధ సామాజిక వర్గాల పెద్దలతో సైలెంట్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే తాను వైసీపీకి రాజీనామా చేసి యానాంలో పోటీ చేస్తానని చెబుతున్నారు కూడా. అయితే కాంగ్రెస్ తరఫునా… లేక స్వతంత్ర అభ్యర్థిగానా అనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పటం లేదు. ఇదే సమయంలో మాజీ మంత్రి మల్లాది కృష్ణారావుతో తరచూ సమావేశం అవుతున్నారు కూడా. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని మల్లాదిని పొన్నాడ కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైంది.