నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల నుంచి స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. రహదారిపై వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డుపై ఉంటే… వారిని స్వయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కూడా నెలకోసారి పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని… కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని హుకుం జారీ చేశారు కూడా. అయినా సరే కొందరు అధికారుల తీరు వల్ల తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా చంద్రబాబుకు చేరుతున్నాయి. దీంతో ఇకపై అధికారుల ప్రమేయం లేకుండా… నేరుగా తమతో మాట్లాడేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు.
Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!
నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన సమయంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. CBN 2.0ను చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. 1995లో అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులను అదికారులు తెలుసుకోవాలన్నారు. ఈ మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి కూడా. నాడు అమలు చేసిన జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకే పాలన వంటి అంశాలతో పాటు డయల్ యువర్ సీఎం కూడా మరోసారి నిర్వహించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం చిన్న మార్పు జరిగింది. డయల్ యువర్ సీఎం కార్యక్రమాన్ని గతంలో ప్రభుత్వం నిర్వహించగా… ఇప్పుడు మాత్రం దీనిని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది.
Also Read : ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. పాక్ తో మ్యాచ్ పై భారత్ ఫోకస్
ప్రతీ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. చంద్రబాబుకు నేరుగా సమస్య విన్నవించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. దీని వల్ల పార్టీ కార్యాలయంలో తోపులాట కూడా చోటు చేసుకుంటోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కేటాయించిన సమయం కూడా దాటి పోతోంది. దీని వల్ల సీఎం షెడ్యూల్ ఆలస్యమవుతోంది. దీనిని పరిష్కరించేందుకు పార్టీ ఓ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. సీఎం చంద్రబాబుకు సమస్యను విన్నవించుకునే వారి కోసం 73062 99999 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వచ్చే విన్నపాలను బట్టి వారికి ఓ రోజు కేటాయిస్తారు. దీని ద్వారా రద్దీ తగ్గించేందుకు వీలవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Also Read : కేసీఆర్ స్పీడ్.. బిజెపిలో మొదలైన టెన్షన్
దీని వల్ల ప్రతి శనివారం 500 మంది సీఎం చంద్రబాబుకు నేరుగా సమస్యలు వివరించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో పరిష్కారం కాని సమస్యలకు కూడా చెక్ పడుతుంది. కొంతమంది పరిష్కారం సాధ్యం కాని సమస్యలపై కూడా సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు. వాటికి పరిష్కారం లభించలేదని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి టోల్ ఫ్రీ నంబర్ ద్వారా చెక్ పడుతుందనేది పార్టీ నేతల భావన. ఇక సమస్య ప్రాధాన్యాన్ని బట్టి అర్జీదారులలకు సమయం కేటాయిస్తారు. దీని వల్ల అందరూ ఒకేసారి కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే భరోసా కూడా లభిస్తుంది. ప్రజలకు మరింత చేరువగా ముఖ్యమంత్రిని తీసుకెళ్లేందుకు పారదర్శక పాలనకు నాంది పలికేందుకు డయల్ యువర్ సీఎం 73062 99999 ఎంతో బాగా ఉపయోగపడుతుందంటున్నారు టీడీపీ నేతలు.




