ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ డిసైడర్ ఆడాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇవ్వనుండగా.. డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు.
దాంతో తుది జట్టు ఎంపిక కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్‌గా మారింది. జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇస్తే ఆకాశ్ దీప్, ముకేష్ కుమార్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. అయితే అనుభవం దృష్య్యా ముకేష్ కుమార్‌కే తొలి ప్రాధాన్యత లభించనుంది. రివర్స్ స్వింగ్‌తో పాటు వైవిధ్యం కొరుకుంటే మాత్రం ఆకాశ్ దీప్ అరంగేట్రం చేయవచ్చు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగితే అక్షర్ పటేల్ జట్టులోకి వస్తాడు. అప్పుడు సిరాజ్ ఒక్కడే పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. రాంచీ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి పేసర్లకు సహకరిస్తోంది. తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా మారుతోంది.
గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్.. రాంచీ టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. అతని రాకతో రజత్ పటీదార్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. అతను గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ సత్తా చాటడంతో వారు జట్టులో కొనసాగనున్నారు. డబుల్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతను పూర్తిగా కోలుకోకుంటే రాంచీ టెస్ట్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. అదే జరిగితే రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది. అప్పుడు శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. స్పిన్నర్ల విషయంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కొనసాగనుండగా.. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లో ఒకరు బరిలో దిగనున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్/ముకేష్ కుమార్.