వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 2011లో రాజకీయ ప్రయాణం మొదలు.. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తండ్రి మరణానంతరం ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శలు ప్రారంభించారు. అయితే దీనికి నాటి కాంగ్రెస్ పెద్దలు అడ్డుచెప్పడంతో తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్.. తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరు వచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. నాటి నుంచి ఏ కార్యక్రమం అయినా సరే.. తండ్రి వైఎస్ఆర్ బొమ్మతోనే ప్రజల్లోకి వెళ్లారు జగన్. 2014, 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు జగన్.
Also Read : సునీల్ లాజిక్.. జగన్‌కు కౌంటర్..!
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం సాక్షి పత్రిక, సాక్షి టీవీలో వైఎస్ఆర్ ఫోటో ఉంచారు. వైసీపీ అంటే వైఎస్ఆర్ అనేలా మార్చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలంతా వైసీపీలో చేరేందుకు ఆ ఫోటోలు, వీడియోలు ఎంతో సాయం చేశాయి. ప్రతి కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్ ఫోటో పెట్టారు జగన్. అలాగే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన జగన్.. దారి పొడవునా వైఎస్ఆర్ విగ్రహాలు ఆవిష్కరిస్తూ పోయారు. దీంతో బడి లేని ఊరు ఉందేమో కానీ.. వైఎస్ఆర్ బొమ్మ లేని గ్రామం మాత్రం లేదు.. అనేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. చివరికి ప్రతి ట్రాఫిక్ కూడలిలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మలు ఏర్పాటు చేశారు.
వైసీపీ 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా వైఎస్ఆర్ ఫోటో చుట్టూ నవరత్నాల పథకాల పేర్లు ప్రచురించారు. రాజన్న రాజ్యం అని తెగ హామీలిచ్చారు. రాజశేఖర్ రెడ్డి లేకపోతే.. తామెవ్వరు లేరు అనేలా పదే పదే ప్రతి సభలో జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి ఫోటోను నెమ్మదిగా తగ్గించేశారు. ప్రతి పథకానికి తన పేరే పెట్టుకున్నారు జగన్. అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక అంటూ పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై కూడా తన పేరే వేసుకున్నారు జగన్. ఇక జగనన్న కాలనీల పేరుతో ప్రతి ఊర్లో పెద్ద ఎత్తున లే అవుట్ వేసేశారు.
Also Read : అవార్డ్ క్రెడిట్ వాళ్ళదే.. చంద్రబాబు కీలక కామెంట్స్
ఇక 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్ఆర్ ఫోటోను పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్. ఎన్నికల మ్యానిఫెస్టోలో తన ఫోటోకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్.. రాజన్న రాజ్యం అనే పేరు పక్కన పెట్టాశారు. మీ బిడ్డ జగన్ పాలన బాగుందా.. అంటూ ఓట్లు అడిగారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఇదే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ ఫోటోతో ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ చనిపోయే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నారని.. కాబట్టి ఆయనను తమ పార్టీ నేతగానే ప్రచారం చేసుకుంటామన్నారు హస్తం పార్టీ నేతలు. ఈ వ్యవహారం కూడా వైసీపీకి చేటు చేసిందని ఆలస్యంగా గుర్తించారు. తాజాగా మరోసారి వైఎస్ఆర్ విగ్రహాలను బయటకు తీశారు. ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి నాటి వైఎస్ఆర్ పాలన అంటున్నారు.
తాజాగా కోటి సంతకాల సేకరణ పేరుతో వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ర్యాలీని వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆ ర్యాలీలో ముందున్న లారీ పైన వైఎస్ఆర్ యోగా చేస్తున్న బొమ్మ పెట్టారు. ఆరోగ్య శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రారంభమైందన్నారు జగన్. ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత ఉందని ఇటీవల పలు సర్వే సంస్థల నివేదికలు వెల్లడించాయి. వాటిని పక్క దారి పట్టించాలంటే.. మళ్లీ తండ్రి వైఎస్ఆర్ బొమ్మ బయటకు తీయాలనేది జగన్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే అటు సోషల్ మీడియాలో, ఇటు బహిరంగ వేదికలపై కూడా వైఎస్ఆర్ బొమ్మ తప్పని సరి అని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

