కూన రవికుమార్. ఈ పేరు శ్రీకాకుళం జిల్లా వాసులకి సుపరిచితం. తెలుగుదేశం పార్టీలో మొదట నుంచి కొనసాగుతున్నారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. సొంత మేనమామ తమ్మినేని సీతారాంపైనే పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి విప్ పదవిని కూడా చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరుకున్నారు. అటువంటి కూన రవికుమార్ రెండోసారి కూడా ఆమదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోని ప్రాధాన సామాజిక వర్గాలలో ఒక్కటైన కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయనకి కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని అంతా ఆశించారు.
కూన రవికుమార్ కి మంత్రి వర్గంలో ఖచ్చితంగా స్థానం దక్కుతుందని సొంత పార్టీ నాయకులతో పాటు అనుచరులు కూడా భావించారు. అయితే జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో కింజరాపు అచ్చెన్నాయుడుకి మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. కేంద్ర మంత్రి వర్గంలో కింజరాపు రామ్మోహన్ నాయుడుకి చోటు దక్కింది. ఒకే కుటుంబానికి చెందిన వారికి అవకాశం ఇచ్చి కళింగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకి చాన్స్ ఇవ్వకపోవడంతో అప్పట్లో ఆ సామాజిక వర్గంలోని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూన రవికుమార్ కి అన్యాయం జరిగిదంటూ సోషల్ మీడియాలోను, సొంత గ్రూపులలో అనుచరులు హల్ చల్ చేశారు.
Also Read : ఇదీ లెక్క.. దమ్ముంటే అసెంబ్లీకి రండి
అంతేకాకుండా ఎమ్మెల్యేగా కూన రవికుమార్ ప్రమాణ స్వీకారం చేసి ఆమదాలవలస నియోజకవర్గానికి వచ్చేటప్పుడు బల ప్రదర్శనను నిర్వహించారు. విశాఖపట్నం నుంచి ఆమదాలవలస వరకూ శ్రీకాకుళం మీదుగా వందలాది కార్లతో ర్యాలీని నిర్వహించి కూన వర్గీయులు హడావుడి చేశారు. విశాఖపట్నం నుంచి ఆమదాలవలస వరకు ర్యాలీ నిర్వహించి తమ సత్తా ఇదంటూ సెల్ఫ్ భూస్టింగ్ ఇచ్చుకున్నారు. అప్పట్లో ఈ ర్యాలీ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన సందర్భంగా ఇంత హడావుడి అవసరమా అన్న ప్రశ్నలు స్థానికులు వ్యక్తం చేసారు.
ఇక కూనకు మంత్రి వర్గంలో చాన్స్ దక్కకపోవడానికి కొందరు కారణమన్న ఆరోపణలు చేస్తూ పరోక్షంగా జిల్లాకి చెందిన కీలక సామాజిక వర్గ నేతలపై విమర్శలు చేసారు. మంత్రివర్గంలో ఎలాగు చాన్స్ ఇవ్వని నేపధ్యంలో టీటీడీ బోర్డులో కూన రవికుమార్ కి అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో మెసేజ్ లు గ్రూపులలో హల్ చల్ చేసాయి. అలాగే ఆయనకి ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వాలని కూడా అనుచరులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. మొన్నటి వరకూ శాసనసభ చీఫ్ విప్ పదవి కూన రవికి దక్కుతుందని ఆయన అనుచరులు ఆశించారు. అయితే విప్ పదవి అదే సామాజిక వర్గానికి చెందిన హ్యట్రిక్ విజయం సాధించిన ఇచ్చాపురం శానససభ్యుడు బెందాళం అశోక్ ను వరించింది.
Also Read : జాతీయ జట్టులో దుమ్మురేపుతున్న గుంటూరు కుర్రోడు
మొదట నుంచి పార్టీకి విధేయుడుగా గుర్తింపు పొందిన అశోక్ కి పదవి వరించగా కూన వర్గీయులు షాక్ కి గురయ్యారు. ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ఇసుక మాఫీయా నడుస్తొంది. అటు వంశధార ఇటు నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లకు కోట్లు అక్రమార్కులు సంపాదిస్తున్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అండతోనే అది నడుస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పేరు చెప్పుకుని అనుచరులు ఇసుక దందాను సాగిస్తున్న తీరు దుమారం రేపుతుంది. ఇటీవల సనపల సురేష్ అనే వ్యక్తి ఇసుకదందాను అడ్డుకోగా ఆతడిపై ఇసుక మాఫియారాయుళ్ళు దాడి చేయడం, వరుసగా కేసులు నమోదు చేసిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి కూడా.
ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సనపల సురేష్ ఇసుక మాఫియా కూన రవికుమార్ అండతోనే చెలరేగిపోతుందని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి తోడు ఆమదాలవలస రోడ్డుతో పాటు శ్రీకాకుళంలో కూడా కూన బంధువులు కొందరు భూ కభ్జాలకు పాల్పడుతున్న తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూన పేరు చెప్పుకుని ఆయన అండదండలు చూసుకుని విలువైన స్థలాలను ఆక్రమించుకుంటున్నారన్న మాట బహిరంగ రహస్యం. ఇంటెలిజన్స్ వర్గాలు ఈ వివరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తొంది.
Also Read : అడ్డంగా బుక్ అయిన కేటిఆర్
ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం కూన రవికుమార్ గట్టిగా పనిచేసారు. జిల్లా అధ్యక్షుడుగా కూడా ఆయన బాధ్యతలను నిర్వహించారు. కష్టకాలంలో ఆయన వెంట ఉండే సొంత నియోజకవర్గంలోని కొందరు నాయకులను ఆయన పక్కన పెడుతున్నారన్న మాట ఇటీవల ఎక్కువగా వినిపిస్తొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను దూరం పెట్టేస్తున్నారని పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడిన నాయకులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆయన చర్యల కారణంగా ఇటీవల స్థానికంగా వ్యతిరేకతను కూన మూటగట్టుకుంటున్నారనేది స్థానికుల మాట. స్వయంకృతాపరాధం వల్లనే పదవులు ఆయనకి కలసి రావడం లేదన్న మాట ఆ ప్రాంత వాసుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూన రవికుమార్ కి పదవి కేటాయించారని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బెందాళం అశోక్ కి ఇప్పుడు విప్ పదవి కేటాయించడం సమంజసమేనని మరికొందరి మాట.