ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉండే గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం మరోసారి ఒక్కసారిగా వేడెక్కింది. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య నడుస్తున్న పోరు ఇప్పుడు బహిరంగ విమర్శలతో పీక్ స్టేజీకి చేరింది. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు మీడియా వేదికగా వల్లభనేని వంశీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నీలాగా నేను సంస్కారం లేని వ్యక్తిని కాదు” అంటూ వంశీ గత ప్రవర్తనను, ఆయన చేసిన పాత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేసారు.
Also Read : వైసీపీలో జగన్ ముందు అసలు సవాల్..!
ఈ సందర్భంగా వల్లభనేని వంశీ గతంలో పార్టీలు మారిన వైనాన్ని, ఆయా సమయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను యార్లగడ్డ నిలదీశారు. “నువ్వు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణిని ఇష్టానుసారం తిట్టింది నిజం కాదా..?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, వంశీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులను గుర్తు చేస్తూ.. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన సతీమణి వైఎస్ భారతిని వంశీ తిట్టలేదా అని నిలదీశారు. “నాడు వైఎస్ భారతి తిహార్ జైలుకు వెళ్తుందని నువ్వు చెప్పింది నిజం కాదా?” అంటూ పాత రికార్డులను బయటకు తీసిన యార్లగడ్డ, చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత వంశీకి లేదని స్పష్టం చేశారు.
Also Read : హైదరాబాద్ టీ20 ముంగిట తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..!
2019 ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్లడం, ఆ తర్వాత సమీకరణాల్లో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరి గత ఎన్నికల్లో గన్నవరం నుంచి ఘనవిజయం సాధించడం తెలిసిందే. అయితే ఇటీవల నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులు, స్థానిక కాంట్రాక్టుల వివాదాలు, వంశీ పరోక్షంగా సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కింది. ఇక వంశీ వ్యాఖ్యలపై అటు వైసీపీలో కూడా ఆసక్తికర చర్చ మొదలైంది.


