ప్రతి విషయంలో గట్టిగా మాట్లాడుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒక్క విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ విషయం ఎత్తాలంటేనే భయపడుతున్నట్లుగా ఉంది. ఏపీలో 30 ఏళ్లు అధికారంలో ఉంటామని గొప్పగా చెప్పారు వైఎస్ జగన్. వాస్తవానికి 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే మాత్రం.. పరిస్థితి మరోలా ఉండేది. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లపై వరుస కేసులు పెట్టి వేధించే వారని.. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భయపడేవారని.. అలా చేయడం వల్ల ఇతర పార్టీల ప్రాభవం తగ్గించి.. తమ ఇమేజ్ పెంచుకోవాలని జగన్ ప్లాన్ చేశారనేది రాజకీయ విశ్లేషకుల మాట. టీడీపీని బలహీనపరిస్తే.. ఏపీలో వైసీపీ మాత్రమే అధికారంలో ఉంటుందని జగన్ స్కెచ్ వేశారని కూడా అప్పట్లో వ్యాఖ్యానించారు. కానీ వై నాట్ 175 అంటూ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ.. ఘోర పరాజయం మూట గట్టుకుంది. దీంతో ఇప్పుడు చాలా విషయాల్లో సైలెంట్ అయ్యింది.
Also Read : అమరావతి ల్యాండ్ పూలింగ్ కూటమి కి లాభమా.. నష్టమా?
వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర రాజధాని విషయం. రాజధానిగా అమరావతి ప్రాంతానికి అసెంబ్లీ సాక్షిగా జగన్ మద్దతు తెలిపారు. రాజధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని కూడా అప్పట్లో జగన్ వ్యాఖ్యానించారు. గుంటూరు – విజయవాడ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని రాజధాని కోసం ఎంపిక చేస్తున్నట్లు అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటించిన తర్వాత జగన్ కూడా తన మద్దతు తెలిపారు. అలాగే 2019 ఎన్నికల సమయంలో కూడా నా ఇల్లు ఇక్కడే ఉంది.. చంద్రబాబుకే ఇల్లు హైదరాబాద్‌లో ఉంది.. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని గొప్పగా ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో జగన్ మాట మార్చేశారు. 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఐదేళ్ల పాటు ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి రాజధాని అంశం కూడా ఒక కారణం.
ఎన్నికల్లో ఓడిన తర్వాతే, రాజధాని విషయంలో వైసీపీకి జ్ఞానోదయం అయినట్లు ఉందని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్న మాట. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నానా తిప్పలు పడిందనేది వాస్తవం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించినప్పటికీ.. పారిశ్రామిక వేత్తలు వేసిన ఒకే ఒక్క ప్రశ్న ప్రభుత్వ పెద్దలను కూడా భయపెట్టింది. “జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. తమ వ్యాపారాలు సజావుగా జరుగుతాయా..?” అని పలువురు పారిశ్రామిక వేత్తలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీకి కూడా కావాల్సినంత చెడ్డపేరు తీసుకువచ్చింది. పరిశ్రమలను తరిమేసిన చరిత్ర వైసీపీదే అని కూటమి నేతలు పదే పదే ప్రచారం చేశారు. దీంతో ఏం జవాబు చెప్పాలో కూడా వైసీపీ నేతలకు అర్థం కాలేదు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే రాజధాని విషయంలో విచిత్రంగా వ్యవహరించిన జగన్.. మరోసారి అలాంటి తప్పు చేసి చేతులు కాల్చుకునే పరిస్థితి రాదంటున్నారు సొంత పార్టీ నేతలు. అందుకే ఇటీవల తన పర్యటనల గురించి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు.. 15 వందల ఎకరాల్లో పరిపాలన భవనాలు, మిగిలిన కార్యాలయాలు కడితే సరిపోతుంది కదా.. అని జగన్ వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్.. ఇప్పుడు మాత్రం అమరావతిలోనే పరిపాలన భవనాలు నిర్మించాలని కొత్త పాట పాడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని కోసం రెండో విడత భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తొలి విడతలో 33 వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం.. రెండో విడతలో ఏకంగా 40 వేల ఎకరాలు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. ఎకరా భూమి తీసుకుంటే.. అందులో 25-30 శాతం భూమిని అభివృద్ధి చేసి ఇస్తున్నారు. దీంతో రైతులు కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
Also Read : ఆ విషయంలో ఒంటరైన నాని..!
రాజధాని రెండో విడత భూ సేకరణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే మాట అంటే.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాజధాని రైతుల విషయం వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులపై కేసులు పెట్టి, వారిపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేసింది. ఎన్నికల్లో ఓటమికి అవి కూడా కారణాలే. అలా కేసులు పెట్టిన జగన్.. ఇప్పుడు రాజధానిలో రెండో విడత భూసేకరణపై మాట్లాడితే.. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తారనేది సొంత పార్టీ నేతల మాట. ఇదే విషయంపై ఇప్పటికే వైఎస్ జగన్ కూడా పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. రాజధాని విషయంలో పార్టీ స్టాండ్ ఏమిటి అనే విషయంపై బొత్స, పెద్దిరెడ్డి, సజ్జల, వైవీ వంటి నేతలతో జగన్ ఇటీవల చర్చించినట్లు సమాచారం. ఆ విషయంలో ఏం మాట్లాడకపోవడమే బెటర్ అని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాజధాని అమరావతిలో భూ కేటాయింపులు, రెండో విడత భూ సేకరణపై జగన్ అండ్ కో టీమ్ ఫుల్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. రైతుల నుంచి వచ్చే స్పందనను చూసి వ్యవహరిస్తే బెటర్ అని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా జగన్ తీరు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

